సైఫాబాద్, వెలుగు : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం బీసీ విద్యార్థి సంఘం బుధవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
నేతృత్వంలో బీసీ సంఘాల నాయకులు బుధవారం లక్డీకాపూల్‌లోని హైదరాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు తరలివచ్చారు.
ఈ సందర్భంగా లోపలకు చొచ్చుకువెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని , లేకపోతే లక్షలాది మంది విద్యార్థులతో కలిసి సెక్రటేరియట్‌తో పాటు ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ సంఘాల నాయకులు జిల్లపల్లి అంజి, నీల వెంకటేష్, నిఖిల్ పటేల్, రాజేందర్ పాల్గొన్నారు.
