తగ్గిన కరెంట్‌‌‌‌ డిమాండ్‌‌‌‌..సగటున రోజుకు 13 వేల మెగావాట్లే వినియోగం

తగ్గిన కరెంట్‌‌‌‌ డిమాండ్‌‌‌‌..సగటున రోజుకు 13 వేల మెగావాట్లే వినియోగం
  •     వరి కోతలతో పడిపోయిన విద్యుత్ వినియోగం
  •     రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో తగ్గిన గృహ వినియోగం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. వరి కోతలు ప్రారంభం కావడంతో వ్యవసాయ రంగానికి విద్యుత్ అవసరం గణనీయంగా తగ్గింది. ఫలితంగా వారం రోజులుగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ప్రతిరోజూ సగటున 13 వేల మెగావాట్ల వద్దే కొనసాగుతోంది. ఆశించినంతగా వర్షాలు లేకపోవడంతో ఈ వానకాలం వ్యవసాయంలో బోర్లు, మోటార్ల వినియోగం ఎక్కువగా జరిగింది. ఫలితంగా గత నెల ఒక దశలో విద్యుత్ డిమాండ్ రోజుకు 20 వేల మెగావాట్ల పీక్‌‌‌‌కు చేరింది. కానీ వారం రోజులుగా సీన్ పూర్తిగా మారిపోయింది. రాష్ట్ర విద్యుత్ వినియోగంలో వ్యవసాయ కనెక్షన్ల వాటా 40 శాతం కావడం, వరి కోతకు వచ్చి రైతులు బోర్లను బంద్ పెట్టడం వల్లే విద్యుత్ డిమాండ్ తగ్గిందని అధికారులు చెప్తున్నారు. దీనికి తోడు వాతావరణంలో మార్పులు రావడం, చలి తీవ్రత పెరుగుతుండటంతో గృహ విద్యుత్​వినియోగం కూడా తగ్గింది. 

జెన్‌‌‌‌కో పవర్ ప్లాంట్ల మరమ్మతులు.. 

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తగ్గడంతో జెన్‌‌‌‌కో తన సొంత థర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించి పెండింగ్‌‌‌‌ పనులు చేపడుతోంది. కీలక మరమ్మతులు, ఇయర్లీ ఓవర్‌‌‌‌హాలింగ్ పనులను వేగవంతం చేసింది. భూపాలపల్లి జిల్లాలోని కేటీపీపీ యూనిట్1, కొత్తగూడెంలోని కేటీపీఎస్ యూనిట్10, మణుగూరులోని భధ్రాధ్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్ 1, 3, యాదాద్రి పవర్ ప్లాంట్‌‌‌‌లోని యూనిట్3లో అధికారులు రిపేర్ వర్క్స్ చేయిస్తున్నారు. వచ్చే యాసంగి సీజన్ సీజన్‌‌‌‌ నాటికి విద్యుత్ డిమాండ్ మళ్లీ పెరిగే చాన్స్ ఉండటంతో ఈ పనులు చేపడ్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. 

అదే సమయంలో డిస్కంలకు కొంత ఊరట లభించింది. కొద్ది నెలలుగా 24 గంటల నిరంతరాయ సరఫరా వల్ల లో-వోల్టేజీ సమస్యలు ఎక్కువగా వచ్చేవి. అధిక లోడ్ కారణంగా ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు కాలిపోయేవి. ప్రస్తుతం డిమాండ్ తగ్గడంతో సబ్-స్టేషన్లు, ఫీడర్లపై భారం తగ్గి కోతల భయం తొలగింది. ప్రస్తుతం ఓపెన్ మార్కెట్‌‌‌‌లో తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుండటంతో డిస్కంలకు ఆర్థికంగా వెసులుబాటు కలిగినట్లయింది.