- ఏజెంట్లతో ఛత్తీస్ గడ్ కు అక్రమంగా తరలింపు
- పట్టించుకోని ఫారెస్ట్ ఆఫీసర్లు
మంచిర్యాల, వెలుగు: కుమ్రం భీమ్ జిల్లాలోని రిజర్వ్ ఫారెస్టులో ఉన్న బొజ్జ చెట్లు అక్రమార్కుల గొడ్డలి వేటుకు బలవుతున్నాయి. లక్క సేకరణ కోసం ఈ వృక్షాలను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. కాగజ్ నగర్ డివిజన్ పెంచికల్ పేట రేంజ్ పరిధిలో వందలాది చెట్లు ఇప్పటికే నేలకొరిగాయి. ఫారెస్టు ఆఫీసర్లు పట్టించుకోకపోవడం వల్ల ఈ వనమేధం యథేచ్ఛగా సాగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అడవులను సంరక్షించాల్సిన ఆఫీసర్ల పర్యవేక్షణ లోపం అక్రమార్కులకు వరంగా మారుతోంది.
లక్క కోసం నరికివేత...
పెంచికల్ పేట్ రేంజ్ పరిధిలో నిత్యం బొజ్జ వృక్షాలను నరికి లక్క సేకరించి సొమ్ము చేసుకుంటున్నారు. అటవీశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంపై ఇటీవల ఓ మాజీ ప్రజాప్రతినిధి అటవీశాఖ తీరుపై బహిరంగంగానే ఆరోపణలు చేశారు. మొర్లిగూడ, జిల్లెడ, అగర్ గూడ, నందిగాం గ్రామాల్లో విస్తరించి ఉన్న అడవుల్లో అధిక సంఖ్యలో బొజ్జ చెట్లున్నాయి. వాటి కొమ్మలను ఆవాసంగా ఏర్పాటు చేసుకున్న లక్క పురుగు లక్కను విసర్జిస్తుంది. ఒక్కో చెట్టుపై సుమారు 10 నుంచి 30 కిలోల వరకు లక్క లభిస్తుంది. కొంతమంది ఏజెంట్లు స్థానికులకు డబ్బు ఆశ చూపి చెట్లు నరికి లక్క సేకరిస్తున్నారు.
ఛత్తీస్ గడ్ కు తరలింపు..
బొజ్జ చెట్టను నరికి సేకరించిన కిలో లక్క స్థానికంగా సుమారు రూ.400 నుంచి రూ.500 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన లక్కను అక్రమంగా మొర్లిగూడ, రాంపూర్ వద్ద ప్రాణహిత నదిని దాటించి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఛత్తీస్ గడ్నుంచి వస్తున్న లక్క వ్యాపారులు కిలోకు సుమారు రూ.1,300 నుంచి రూ.1,500 చెల్లించి కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. ప్రతిరోజు క్వింటాళ్ల కొద్దీ లక్కను అక్రమంగా సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
లక్క అనేది కీటకాల నుంచి లభించే ఒక సహజమైన రెసిన్ (జిగురు) పదార్థం. ఇది విషపూరితం కాని, పర్యావరణ అనుకూలమైన పదార్థం కావడం వల్ల అనేక పరిశ్రమలు, ఇతర పనుల్లోనూ విస్తృతంగా వినియోగిస్తారు. కలప వస్తువులకు మెరుపు ఇవ్వడానికి, చెదలు, తేమ నుంచి రక్షించడానికి వార్నిష్, పాలిష్ తయారీలో లక్కను ఎక్కువగా వాడతారు. ఔషధ రంగంలో క్యాప్సూల్స్ తేమ వల్ల పాడవకుండా, ఫంగస్ చేరకుండా వాటిపై రక్షణ పొర వేయడానికి దీనిని ఉపయోగిస్తారు.
అలాగే యాపిల్స్, నిమ్మ వంటి పండ్లు త్వరగా పాడవకుండా, తాజాగా కనిపించడానికి, చాక్లెట్లు, స్వీట్లకు మెరుపు కోసం ఫుడ్-గ్రేడ్ లక్కను పూతగా వాడతారు. అంతేకాదు సాంప్రదాయ లక్క గాజులు, బొమ్మలు, అలంకరణ వస్తువుల తయారీలో, బంగారు, వెండి ఆభరణాల్లో రాళ్లను బిగించడానికి దీనిని ఉపయోగిస్తారు. నెయిల్ పాలిష్, లిప్స్టిక్, మస్కారా, హెయిర్ స్ప్రే వంటి సౌందర్య సాధనాల తయారీలో సైతం లక్క ఒక ముఖ్యమైన ముడిసరుకు.
విద్యుత్ నిరోధకత కలిగిన పదార్థంగా వైర్లు, మోటార్లు, సర్క్యూట్ బోర్డులపై పూత వేయడానికి దీనిని వాడతారు. పోస్టాఫీసులు, బ్యాంకుల్లో, పార్శిళ్లకు సీల్ వేయడానికి, ప్రింటింగ్ ఇంక్, ఫొటోగ్రఫీ ఉత్పత్తులోనూ కూడా లక్కను వాడతారు.
పట్టించుకోని ఆఫీసర్లు..
కండ్ల ముందే బొజ్జ చెట్లు నేల కూలుతున్నా ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల లక్క సేకరణపై నిఘా పెట్టిన అధికారులు కొంతమందిని అదుపులోకి తీసుకుని ఫారెస్ట్ ఆఫీసులో విచారించి జరిమానా విధించినట్టు తెలిసింది. కానీ, పూర్తిస్థాయిలో ఈ దందాను కంట్రోల్ చేయడంపై దృష్టి పెట్టడం లేదంటున్నారు. అధికారుల నిఘా లోపంతో అడవుల్లో పెద్దపెద్ద వృక్షాలు గొడ్డలి వేటుకు కుప్ప కూలుతున్నాయి.
అడవుల్లోకి ప్రవేశిస్తేనే కేసులు నమోదు చేస్తున్న అటవీశాఖ ఆఫీసర్లు చెట్ల నరికివేత, లక్క సేకరణను ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికైనా అంతర్రాష్ట్ర లక్క అక్రమ రవాణాపై నిఘా పెట్టి విలువైన అటవీ సంపదను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
