నాడ్‌పల్లిలో 50 ఎకరాలపై వివాదం
న్యూఢిల్లీ, వెలుగు: నిజామాబాద్ జిల్లా నాడ్‌పల్లి గ్రామంలోని శీతల్ టౌన్షిప్ భూవివాదంలో తెలంగాణ యూనివర్సిటీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ భూమిపై వర్సిటీ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. నాడ్‌పల్లిలోని సర్వే నంబర్ 334లో ఉన్న 50 ఎకరాల భూమిపై శీతల్ టౌన్‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోంది. ఈ భూమి తమదేనని సంస్థ, పోరంబోకు భూమి అని రెవెన్యూ అధికారులు వాదిస్తున్నారు. 2007లో ఇందులో కొంత భూమిని ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీకి కేటాయించింది.
1958-–59లో ప్రభుత్వ వేలంలో విశ్వనాథం, రాజేందర్ ఈ భూమిని కొనుగోలు చేశారని, వారి వారసుల నుంచి 2004–-06 మధ్య రిజిస్టర్డ్ సేల్ డీడ్ల ద్వారా తాము కొనుగోలు చేశామని శీతల్ టౌన్‌షిప్ సంస్థ తెలిపింది. తమకు పట్టాదారు పాస్‌బుక్‌లు కూడా జారీ అయ్యాయని పేర్కొంది. 2012లో సివిల్ కోర్టును ఆశ్రయించగా, 2018లో కేసులు కొట్టివేయడంతో హైకోర్టుకు వెళ్లింది. అక్కడ సంస్థకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ తెలంగాణ వర్సిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
బుధవారం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇదే అంశంపై గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా పిటిషన్లు వేసిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. వర్సిటీ తరఫు సీనియర్ న్యాయవాది జోక్యం చేసుకుని, ప్రభుత్వం వకాలత్‌నామా లేకుండానే పిటిషన్ వేసిందని, వర్సిటీ వాదనలు వినాలని కోరారు. అయితే ధర్మాసనం ఈ అభ్యర్థనను అంగీకరించకుండా పిటిషన్‌ను కొట్టివేసింది.
