వచ్చే నెల 24 నాటికి పెసా చట్టం అమల్లోకి వచ్చి 30 ఏండ్లు పూర్తి
హైదరాబాద్, వెలుగు: గిరిజన సంస్కృతి, వారసత్వం, సంప్రదాయ హక్కులను చాటిచెప్పే జాతీయ స్థాయి ‘పెసా మహోత్సవ్’కు హైదరాబాద్ వేదిక కానుంది. పెసా చట్టం-1996 అమల్లోకి వచ్చి 30 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 24న పెసా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ వేడుకలు జరగనున్నాయి. ఐదో షెడ్యూల్ ప్రాంతాలు ఉన్న తెలంగాణతో పాటు ఏపీ, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొననున్నారు.
గిరిజన హక్కులపై చర్చ..
1996 డిసెంబర్ 24న అమల్లోకి వచ్చిన పెసా చట్టం ప్రకారం గ్రామసభలకు ఉన్న అధికారాలు, నిధుల కేటాయింపు, వాటి అమలుపై మహోత్సవంలో సమీక్షించనున్నారు. 10 రాష్ట్రాల్లోని పెసా గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందుతున్న నిధులు, వాటితో చేపడుతున్న అభివృద్ధి పనులు, ఉత్తమ విధానాలపై ప్రతినిధులు ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. చట్టం అమలులో ఎదురవుతున్న సమస్యలు, క్షేత్రస్థాయిలో శాఖల మధ్య సమన్వయంపైనా చర్చించనున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పాటు రాష్ట్రాల పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ, రెవెన్యూ, మైనింగ్ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. జల్, జంగల్, జమీన్‌తో పాటు చిన్న తరహా ఖనిజాలు, అటవీ ఉత్పత్తులపై గ్రామసభల హక్కులను మరింత బలోపేతం చేసే అంశాలపైనా చర్చించనున్నారు.
