ఓయూ, వెలుగు: జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో తమ వాటా కోసం బీసీ కులాల ప్రజలు పోరాటం చేయాల్సిందేనని, అప్పుడే తమ వాటా దక్కుతుందని ప్రముఖ సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రీ థింకింగ్ క్యాస్ట్ సెన్సెస్ పాలసీ, పాలిటిక్స్, పబ్లిక్ డిస్కోర్స్ అనే అంశంపై 2 రోజుల నేషనల్ వర్క్ షాప్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ప్రారంభమైంది.
బుధవారం ప్రారంభ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ జనాభా లెక్కలతోపాటు కుల గణన కూడా చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేసిన కుల గణనతోనే సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థలు వాటికి ఆమోదం తెలుపుతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ డాక్టర్ ఆర్.బాల లక్ష్మి మాట్లాడుతూ కులగణన చేయడం ద్వారానే ఆయా ప్రజల సంక్షేమంతోపాటు అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. కులగణన అంటే ప్రజలను విభజించడం అనే అపోహ తొలగిపోవాలన్నారు. కుల గణనతోనే ప్రజల సామాజిక, విద్య, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు తెలుస్తాయని, దీంతో ప్రభుత్వాలు సరైన అవగాహనతో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుందన్నారు.
