హైదరాబాద్, వెలుగు: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లో అంతర్గత అవినీతిని ఏమాత్రం సహించేది లేదని తెలంగాణ ఏసీబీ డీజీ చారుసిన్హా బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అధికారులపై వచ్చే ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తామని, నిజమని తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఏడీఈ ఎరుగు అంబేద్కర్.. ఏసీబీ అధికారులపై చేసిన అవినీతి ఆరోపణలు శాఖలో కలకలం రేపాయి. అక్టోబర్ 3న ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ కేసును దర్యాప్తు చేసిన డీఎస్పీ ఆనంద్, ఇన్స్పెక్టర్ సుధీర్‌బాబు సహా ఇతర సిబ్బందిపై ఏసీబీ హెడ్‌క్వార్టర్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
అయితే, ఆధారాలు సమర్పించేందుకు అంబేద్కర్‌ను మూడుసార్లు విచారణకు పిలిచినా హాజరుకాలేదని ఏసీబీ పేర్కొంది. దీనిపై మాజీ ఏడీఈ అంబేద్కర్ స్పందిస్తూ.. తాను ఆరోపణలు చేయడం లేదని, లంచం డిమాండ్ చేసిన ఆడియో ఆధారాలను స్పష్టంగా చూపించానని తెలిపారు. సొంత అధికారులను కాపాడుకునేందుకే ఏసీబీ కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు. 17న విచారణకు రావాలని 19వ తేదీన సమాచారం ఇచ్చారని విమర్శించారు. ఇదేంటని అడిగినా ఇంతవరకు సమాధానం ఇవ్వలేదని తెలిపారు.- ముందుగా అవినీతి అధికారులపై కేసు నమోదు చేసి విచారించాలని డిమాండ్ చేశారు.
