- 15 నెలలకు సరిపడా సన్నబియ్యం నిల్వలు సిద్ధం చేయాలి
- సివిల్ సప్లయిస్ శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో ఆహార భద్రతకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాపంపిణీ వ్యవస్థతో పాటు ప్రభుత్వ అవసరాలకు కనీసం 15 నెలలకు సరిపడా సన్నబియ్యం నిల్వలు సిద్ధం చేయాలని సూచించారు. బుధవారం సివిల్ సప్లయిస్ శాఖ పనితీరుపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 14 నెలలకు సరిపడా సన్నబియ్యం నిల్వలు ఉన్నాయని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో నెలకు పెంచాలని చెప్పారు. ఎల్‌నినోతో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారినా ఆహార భద్రతకు ఇబ్బంది రాకుండా పటిష్ఠ కార్యాచరణతో సిద్ధంగా ఉండాలన్నారు. సన్నబియ్యం పథకానికి నిరంతరాయంగా సరఫరా చేసేందుకు సన్నరకాల ధాన్యం కొనుగోళ్లను గరిష్ఠ స్థాయికి పెంచాలని ఆదేశించారు. కొనుగోళ్లలో ఎలాంటి తగ్గింపు ఉండకూడదన్నారు.
రేషన్ సరుకుల జాబితా పెంపు.. ఆధునిక సైలోల నిర్మాణం..
రేషన్ దుకాణాల ద్వారా మరిన్ని నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే అంశంపై ఆర్థికంగా సాధ్యమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన మేరకు పేద, బలహీన వర్గాల అవసరాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదనలు రూపొందించి కేబినెట్ సబ్ కమిటీకి సమర్పిస్తామన్నారు. ధాన్యం ఉత్పత్తి, ప్రభుత్వ కొనుగోళ్లు పెరుగుతున్నా నిల్వ సదుపాయాలు సరిపోవడం లేదని మంత్రి పేర్కొన్నారు. ప్రతి కొనుగోలు సీజన్‌లో ప్రైవేట్ రైస్‌మిల్లర్లపై ఆధారపడాల్సి వస్తోందన్నారు.
ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆధునిక సైలో ఆధారిత గోదాములు నిర్మించాలని చెప్పారు. వానాకాలం, యాసంగి కొనుగోళ్లను పరిశీలించి 10 ప్రధాన కొనుగోలు క్లస్టర్లను గుర్తించాలని, తొలిదశలో అక్కడే నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సైలోల నిర్మాణానికి తక్కువ వడ్డీ, ఎక్కువ కాలపరిమితితో రుణాలు సమీకరించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వానికి బకాయిపడిన రైస్‌మిల్లర్ల నుంచి ప్రతి రూపాయి వసూలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. సీఎంఆర్ బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలని, మిల్లర్లు ఇచ్చిన హామీల అమలును నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో బకాయిల ఎగవేతకు అవకాశం లేకుండా పటిష్ఠమైన ఆర్థిక భద్రతా విధానాలు రూపొందించాలని చెప్పారు.
