- మరో 4 రియల్ ఎస్టేట్ సంస్థలకు రూ.51.16 లక్షల జరిమానా
- నిబంధనలు ఉల్లంఘించడంపై రెరా కొరడా
హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ నిబంధనలను ఉల్లంఘించడం, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వడం, గడువులోగా ఇళ్లను అప్పగించకపోవడంపై రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కఠిన చర్యలు తీసుకుంది. కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడుతూ పలు ప్రముఖ నిర్మాణ సంస్థలకు భారీ జరిమానాలు విధించడంతో పాటు వడ్డీతో సహా సొమ్మును తిరిగి చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది. రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ లేకుండానే డబ్బులు వసూలు చేసినందుకు ఏలియన్స్ డెవలపర్స్ సంస్థకు రెరా రూ.2 కోట్ల భారీ జరిమానా విధించింది. 7 రోజుల్లోగా అగ్రిమెంట్ అందించాలని, లేదంటే కొనుగోలుదారులు చెల్లించిన రూ. 42.11 లక్షల మొత్తాన్ని 10.85% వార్షిక వడ్డీతో 60 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. 'అక్షిత హైట్స్' ప్రాజెక్టుకు అనుమతి లేని సదుపాయాలు కల్పిస్తామని తప్పుడు ప్రకటనలు ఇచ్చినందుకు అక్షిత ఇన్ఫ్రా సంస్థకు రూ.10.06 లక్షల ఫైన్ వేసింది.
వీటితో పాటు ఈఎల్వీ డెవలపర్స్, ఈఎల్వీ లెగసీ, వాసవీ రియల్టర్స్, భారతి బిల్డర్స్, అలేఖ్య ఇన్ఫ్రా డెవలపర్స్ తదితర మరో 8 సంస్థలపై చర్యలు తీసుకున్నది. కొండాపూర్‌లో సుమారు 8 ఎకరాల్లో 4 టవర్లు, 1,300కు పైగా ఫ్లాట్లతో నిర్మించతలపెట్టిన ‘ఆరో సఫైర్’ ప్రాజెక్టుకు రెరా నమోదు లేకుండానే డిజిటల్ మాధ్యమాల్లో ప్రచారం నిర్వహించినందుకు ఆరో రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.25 లక్షల జరిమానా విధించింది. చందానగర్‌లోని ‘బహితి’, సైనిక్‌పురిలోని ‘ఆల్టెయిర్’ ప్రాజెక్టులకు రెరా అనుమతి లేకుండానే ప్రకటనలు ఇచ్చినందుకు జనప్రియ టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 10 లక్షల జరిమానా విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. కాప్రాలోని జీకేస్ ప్రవిష్ అబోడ్ ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ సమయంలో భూమికి సంబంధించిన పెండింగ్ సివిల్ కేసుల వివరాలను వెల్లడించనందుకు జీకేహెచ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.6.10 లక్షల జరిమానా విధించారు.
