హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంజనీరింగ్ కంపెనీ ‘ఆర్డీ ఇంజనీరింగ్ లిమిటెడ్’ లో పిరమల్ ఆల్టర్నేటివ్స్ రూ. 225 కోట్ల భారీ పెట్టుబడి పెట్టింది. తమ ‘పిరమల్ ఇండియా క్రెడిట్ ఆపర్చునిటీస్ ఫండ్-2’ ద్వారా ఈ నిధులను సమకూర్చినట్లు బుధవారం ప్రకటించింది. ఫ్యాక్టరీలు, గిడ్డంగుల నిర్మాణానికి వాడే ప్రీ-ఇంజనీర్డ్ బిల్డింగ్స్ (పీఈబీ), మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్‌ను ఆర్డీ ఇంజనీరింగ్ తయారు చేస్తుంది. తాజాగా సేకరించిన నిధులతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు డేటా సెంటర్లు, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల రంగాల్లో మరిన్ని భారీ ప్రాజెక్టులు చేపట్టనున్నామని సంస్థ సీఎండీ చంద్ర మోటూరు తెలిపారు. దేశంలో తయారీ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, బలమైన సాంకేతిక సామర్థ్యం ఉన్న ఆర్డీ ఇంజనీరింగ్ వృద్ధికి తోడ్పడటం సంతోషంగా ఉందని పిరమల్ ఆల్టర్నేటివ్స్ ఎండీ కల్పేష్ కిఖానీ పేర్కొన్నారు.
