తెలంగాణ సాహిత్య, సామాజిక చరిత్రలో దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు, బిరుదురాజు రామరాజుది ప్రముఖ స్థానం. ఒకరు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన కలంతో ప్రజల్లో చైతన్యం రగిలిస్తే.. మరొకరు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని ప్రజల జీవితాలను అక్షరబద్ధం చేశారు. ఇంకొకరు మరుగునపడిన జానపద సాహిత్య సంపదను వెలికితీసి తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారు. వీరి జీవితాలు, రచనలు తెలంగాణ చరిత్ర, సాహిత్య వైభవానికి అద్దం పడుతున్నాయి. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం, తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించిన మన తెలంగాణ కవులు, రచయితలు చేసిన కృషి, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..
దాశరథి కృష్ణమాచార్యులు
వరంగల్ జిల్లాలోని చిన్నగూడురులో దాశరథి కృష్ణమాచార్యులు జన్మించారు. ఈ గ్రామం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నది.
దాశరథి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిష్ సాహిత్యంలో బీఏ చదివారు. ఉపాధ్యాయుడిగా, ఆకాశవాణి ప్రయోక్తగా కొంతకాలం ఉద్యోగం చేశారు. 1977–83 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా పనిచేశారు. ఈయన బిరుదులు కళాప్రపూర్ణ, అభ్యుదయ కవి.
దాశరథి తిమరంతో సమరం రచనకు 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆంధ్రమహాసభలో భాగంగా గ్రామగ్రామాన తిరిగి ప్రజలను చైతన్యవంతం చేశారు.
ప్రజా ఉద్యమంలో చురుకైన పాత్ర వహిస్తున్న దాశరథిని 1947లో నిజాం ప్రభుత్వం అరెస్టు చేసి నిజామాబాద్‌లోని ఇందూరు కోట జైలులో బంధించింది. ఈయనతోపాటు వట్టికోట ఆళ్వారుస్వామిని కూడా బంధించారు. పళ్లు తోముకోవడానికి ఇచ్చే బొగ్గుతో దాశరథి జైలు గోడల మీద పద్యాలు రాసేవారు. అయితే, ఈ పద్యాలు వట్టికోట రాశాడనుకుని పోలీసులు అతనిని దండించేవారు.
రచనలు
అగ్నిధార, రుద్రవీణ, పునర్నవం, గాలిబ్ గీతాలు, ఆలోచనాలోచనలు, కవితాపుష్పకం, మహాబోధి, మహాంద్రోద్యయం, అమృతాభిషేకం, నవమి, మహాశిల్పి జక్కన్న, తిమిరంతో సమరం.కవితా పుష్పకం రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దాశరథి కృష్ణమాచార్య తొలి అవార్డును తిరుమల శ్రీనివాసాచార్యులు (కరీంనగర్) అందుకున్నారు.
దాశరథి రంగాచార్య
నిజాం రాష్ట్రంలోని వరంగల్ జిల్లా చిన్న గూడురులో దాశరథి రంగాచార్య జన్మించారు. ఈయన దాశరథి కృష్ణమాచార్యులకు స్వయాన సోదరుడు. దాశరథి రంగాచార్య ఆరో తరగతిలోనే నిజాం నవాబు విధించిన యూనిఫాం కుచ్చుటోపీకి బదులుగా గాంధీ టోపీ పెట్టుకుని విద్యార్థులతో సమ్మె చేయించి పాఠశాల నుంచి బహిష్కరణకు గురయ్యాడు. దాశరథి రంగాచార్య 1951–57 మధ్య ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
దాశరథి రంగాచార్యులను అక్షర వాచస్పతి, తెలంగాణ కరదీపికగా పేర్కొంటారు. నిజాం రాచరికానికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. దాశరథి రంగాచార్య ఆత్మకథ జీవనయానం.
రచనలు: చిల్లర దేవుళ్లు, మోదుగు పూలు, జనపదం, మాయజలతారు, సరతల్పం, శ్రీమద్రామాయణం, రానున్నది ఏది నిజం, శ్రీమహాభారతం. మోదుగు పూలు, చిల్లర దేవుళ్లు రచనల్లో తెలంగాణలో స్వాతంత్ర్య పూర్వపు పరిస్థితులను, తెలంగాణ పోరాటాలను వివరించాడు.
బిరుదురాజు రామరాజు
వరంగల్ జిల్లాలోని దేవనూరు గ్రామంలో బిరుదురాజు రామరాజు జన్మించారు. జానపద సాహిత్యంపై పరిశోధన చేసి 1956లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగులో పీహెచ్డీ పట్టా పొందిన మొదటి వ్యక్తిగా బిరుదురాజు రామరాజు ప్రఖ్యాతిగాంచారు.
రచనలు :మరుగున పడిన మాణిక్యాలు, చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్రయోగులు.శ్రీకృష్ణదేవరాయల – జాంబవతి పరిణయం, పాల్కురికి సోమనాథుని – పండితారాధ్య చరిత్ర, బసవోదాహరణం, శ్రీనాథుడి – శివరాత్రి మహాత్యం, మడికి సింగన – పద్మపురాణం వంటి వాటిని వెలికితీసి పరిశోధించి పరిష్కరించారు.
