హనుమకొండలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. బారిస్టా జ్యూస్ కేఫ్ మూసివేత

 హనుమకొండలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. బారిస్టా జ్యూస్ కేఫ్ మూసివేత

రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు పట్టణాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు పలు సంస్థలను సీజ్ చేయడం, ఫైన్లు విధించడం చేశారు. లేటెస్టుగా గురువారం (2026 నవంబర్ 26) హనుమకొండలో జరిపిన తనిఖీల్లో అధికారులు విస్తుపోయే విషయాలను వెల్లడించారు. 

 హనుమకొండలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించిన బారిస్టా జ్యూస్ కేఫ్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు  బాలసముద్రంలోని బారిస్టా జ్యూస్ కేఫ్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అపరిశుభ్ర వాతావరణంతో పాటు కుళ్లిపోయిన పండ్లు, పాడైన ఆహార పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు.

జ్యూస్ తయారీకి వినియోగించే పరికరాలు సైతం తుప్పు పట్టినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా కేఫ్‌కు సంబంధించిన ఫుడ్ లైసెన్స్ గడువు కూడా ముగిసినట్లు వెల్లడించారు. ఆహార భద్రతా నిబంధనలు పాటించకపోవడంతో నిర్వాహకులకు షోకాజ్ నోటీసు జారీ చేసి, కేఫ్‌ను మూసివేశారు.

ALSO READ : తెలంగాణలో ఆ రెండు జిల్లాల్లో నక్సల్స్ పూర్తిగా నశించారు: కేంద్రం రిపోర్ట్

ఇదే సమయంలో కేఫ్‌లో వినియోగిస్తున్న పామాయిల్ నమూనాలను అధికారులు సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లావ్యాప్తంగా తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.