ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో భారతీయ విద్యార్థినికి చేదు అనుభవం.. వర్ణవివక్ష చూపారంటూ వీడియో రిలీజ్

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో భారతీయ విద్యార్థినికి చేదు అనుభవం.. వర్ణవివక్ష చూపారంటూ వీడియో రిలీజ్

ఆక్స్‌ఫర్డ్, వెలుగు: అభివృద్ధి చెందినట్లుగా చెప్పుకుంటున్న పాశ్చాత్య  దేశాల్లో వర్ణవివక్ష, జాత్యహంకార ధోరణి ఇంకా పోవటంలేదు. కొందరు ఇతర దేశాల విద్యార్థులను, పౌరులను వివక్షతో కూడిన మాటలతో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. లేటెస్టుగా బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న భారతీయ విద్యార్థినికి ఇలాంటి చేదు అనుభవం ఎదురవటం చర్చనీయాంశంగా మారింది. తనపై వర్ణవివక్ష చూపారని పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.  

కామాక్షి అనే ఈ విద్యార్థిని 2026 నవంబర్ 21న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసి తనకు జరిగిన అవమానాన్ని పంచుకున్నారు.  ఒక స్టోర్‌లో తాను వస్తువులను చూస్తుండగా ఈ ఘటన జరిగిందని ఆమె వివరించింది. ఆ స్టోర్‌లో ఒక తెల్లజాతి మహిళ తన చుట్టూ తిరగడం గమనించానని కామాక్షి చెప్పింది. ఆ మహిళ తనను ఎందుకు అనుసరిస్తుందో మొదట అర్థం కాలేదని, అయితే తాను ఆమెను ఏమీ ప్రశ్నించలేదని పేర్కొంది.

కొద్దిసేపటి తర్వాత ఆ మహిళ నేరుగా కామాక్షి దగ్గరకు వచ్చింది. నేను ఇది చెప్పాలనుకోవడం లేదు కానీ చెప్పక తప్పడం లేదు.. నీ నుంచి చాలా దుర్వాసన వస్తోంది అని ఆ మహిళ అన్నట్లు విద్యార్థిని వెల్లడించింది. ఆ కామెంట్ వినగానే తాను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని కామాక్షి చెప్పింది. ఆ మహిళ తనతో ఆ మాట చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయిందని, తనకు స్పందించే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ ఘటన తనను ఎంతగానో బాధించిందని, ఆ రోజంతా పబ్లిక్ ప్రదేశాల్లో ఉండాలంటేనే అసౌకర్యంగా అనిపించిందని కామాక్షి వివరించింది. ఆ రోజు తాను తన తండ్రికి ఇష్టమైన పర్ఫ్యూమ్‌ను రాసుకున్నానని..  అయినా  ఉద్దేశపూర్వంగా, తన జాత్యహంకార ధోరణితో తనను అవమానించిందని పేర్కొన్నారు. అయినా ఆ మహిళ ఎందుకు అలా అన్నదో అర్థం కాలేదని కామాక్షి తెలిపారు. ఈ ఘటన వల్ల మిగిలిన రోజంతా అందరి దృష్టి తనపై పడకుండా ఉండేందుకు, తన ఉనికిని తగ్గించుకునేందుకు ప్రయత్నించానని చెప్పారు.

బ్రిటన్‌లో తాను ఎదుర్కొంటున్న చిన్నపాటి వేధింపుల్లో ఇది కూడా ఒకటని కామాక్షి అభిప్రాయపడ్డారు. ఇలాంటి చిన్న ఘటనలు కూడా ఒక వ్యక్తిపై తీవ్రమైన మానసిక ప్రభావం చూపుతాయని ఆమె వివరించారు.  భారత్‌లోని తన స్నేహితుడు చెప్పిన ఒక కొటేషన్ తో కామాక్షి తన వీడియోను ముగించారు. మనం ప్రతిరోజూ పోరాడుతాము, కొన్నిసార్లు ఓడిపోతాము, కానీ ఈ ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటాము అంటూ అని ఆమె పేర్కొంది. 

కామాక్షి వీడియోకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భారీ మద్దతు లభించింది. చాలామంది ఆమెకు సంఘీభావం తెలుపుతూ ఆ గుర్తు తెలియని మహిళ ప్రవర్తనను ఖండించారు. కామాక్షి తప్పు ఏమీ లేదని, ఇలాంటి వ్యాఖ్యలకు బాధపడొద్దని సూచించారు.