తెలంగాణ నీళ్ల దోపిడీకి ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్రకు ఇదొక నిదర్శనం. శ్రీశైలం రైట్ కెనాల్ (SRMC) లైనింగ్ పనులు వేగంగా పూర్తి చేసి కృష్ణా జలాలలను రాయల సీమకు తరలించాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగా ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు లైనింగ్ పనులను దాదాపు పూర్తి చేసింది ఏపీ ప్రభుత్వం. మిగిలిన పనులను కూడా ఈ సీజన్లోనే ముగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. 2027 వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేసి రోజుకు 8 టీఎంసీల నీటిని తరలించాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఈ పరిణామాలు తెలంగాణ నీటి వాటాపై తీవ్రప్రభావం చూపుతాయన్న చర్చ మొదలైంది..
శ్రీశైలం నీళ్లను రాయలసీమ ప్రాంతానికి తరలించే శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ (ఎస్ ఆర్ఎంసీ) కి లైనింగ్ పనులనూ చంద్రబాబు ప్రభుత్వం వేగవంతం చేసింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు 16.4 కిలో మీటర్ల పొడవున్న ఈ ఎస్ఆర్ఎంసీ లైనింగ్ పనులు ఇప్పటికే దాదాపు పూర్తికావచ్చాయి.
సైడ్ లైనింగ్ 13 కిలోమీటర్లు పూర్తవ్వగా.. బెడ్ లైనింగ్ (అడుగు భాగం) 10 కిలోమీటర్లు పూర్తయినట్టు అధికార వర్గాలే చెబుతున్నాయి. ప్రస్తుతం చిన్నచిన్న రిపేర్లు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మరో రెండు రోజుల్లో లైనింగ్ పనులను పున:ప్రా రంభించనున్నట్టు సమాచారం.
మరో సైడ్ లైనింగ్ పనులు 3.4 కిలోమీటర్లు మాత్రమే ఉండడంతో. ఈ సీజన్లోనే పూర్తి చేయాలని అధికారులకు చం ద్రబాబు ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. అంటే 2027 వర్షాకాలం ప్రారంభం నాటికి ఎస్ఆర్ఎంసీ లైనింగ్ ను పూర్తి చేసి శ్రీశైలం నుంచి రోజూ 8 టీఎంసీలనీటిని మళ్లించుకునేందుకు శరవేగంగా దంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.
శ్రీశైలం నీటిని రాయలసీమకు తరలించే ప్రాజెక్టుల పనులు వేగం పుంజుకోవడంతో తెలంగాణలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం చర్యలు తెలంగాణ నీటి ప్రయోజనాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇప్పటికే కృష్ణా నీటి పంపకాలపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలుండగా.. ఎస్ఆర్ఎంసీ లైనింగ్ పనులతో మరింత జఠిలమవుతున్నాయి.
