తిరుమలలో పోలీసులు స్పెషల్ డ్రైవ్.. అనధికారంగా ఉంటున్న 62 మంది గుర్తింపు

తిరుమలలో పోలీసులు స్పెషల్ డ్రైవ్.. అనధికారంగా ఉంటున్న 62 మంది గుర్తింపు
  • తిరుమలలో భక్తుల వసతి సముదాయాలు, హాళ్లలో ప్రత్యేక తనిఖీలు.
  • అనధికారికంగా ఉంటున్న వ్యక్తులు, యాచకులు కలిపి 62 మంది గుర్తింపు
  • కౌన్సెలింగ్ నిర్వహించి తిరుమల నుంచి కిందికి తరలింపు.
  • స్థానిక వ్యాపారులు తమ వద్ద పనిచేసే కార్మికుల పూర్వాపరాలు తెలుసుకుని, వారికి తగిన వసతి కల్పించాలని సూచన.

 శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల భద్రత, సౌకర్యాలను కాపాడటంతో పాటు తిరుమల పవిత్రతను పరిరక్షించే లక్ష్యంతో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మరియు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్  కె.వి. మురళీకృష్ణ, ఐపీఎస్., గార్ల ఆదేశాల మేరకు, తిరుమల డీఎస్పీ  పర్యవేక్షణలో తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో భాగంగా భక్తుల కోసం కేటాయించిన వసతి సముదాయాలు, హాళ్లలో అనధికారికంగా ఉంటూ భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్న వ్యక్తులతో పాటు యాచకులను గుర్తించారు. ఈ క్రమంలో మొత్తం 62 మందిని గుర్తించి, వారికి కౌన్సెలింగ్ నిర్వహించి తిరుమల నుంచి కిందికి తరలించారు. తిరుమలలో అనుమతులు లేకుండా ఉండటం, భక్తులకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడటం, యాచించడం వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని వారికి స్పష్టంగా హెచ్చరించారు.

 తిరుమలలోని స్థానిక వ్యాపారులు తమ వద్ద పనులకు నియమించుకునే కార్మికుల పూర్వాపరాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే పనుల్లోకి తీసుకోవాలని, వారికి తగిన వసతి సౌకర్యాలు కల్పించాలని అధికారులు సూచించారు. కార్మికులకు సరైన నివాస సదుపాయాలు కల్పించకుండా వారిని తిరుమలలో అనధికారికంగా ఉండే పరిస్థితులకు గురిచేయరాదని స్పష్టం చేశారు.

తిరుమలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అనధికారిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసు, టీటీడీ విజిలెన్స్ విభాగాల ఆధ్వర్యంలో ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ భక్తులకు ఇబ్బందులు కలిగించే వారిపై పరిస్థితులను బట్టి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తిరుమలకు విచ్చేసే భక్తులు అనధికారిక వ్యక్తులను ప్రోత్సహించకుండా, ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించిన వెంటనే పోలీసులకు లేదా టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించి సహకరించాలని పోలీసు విజ్ఞప్తి చేశారు