తక్కువ ధరకే ఫ్లాట్.. సగం ధరకే విల్లా.. అంటూ రియల్ ఎస్టేట్ సంస్థలు ఇచ్చే ప్రీ-లాంచ్ ఆఫర్లను నమ్మితే కష్టపడి సంపాదించిన డబ్బులు పోయే ప్రమాదం ఉంది. ఆకర్షణీయమైన బ్రోచర్లు, సెలబ్రిటీల ప్రచారంతో కొనుగోలుదారులను బుట్టలో వేసుకుంటున్న కొన్ని సంస్థలు.. డబ్బులు వసూలు చేశాక ముఖం చాటేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏటా వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరుగుతుండగా, అదే స్థాయిలో మోసాలూ బయటపడుతున్నాయి. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చర్యలు ముమ్మరం చేసింది. గత 15 రోజుల్లోనే దాదాపు 25 నిర్మాణ సంస్థలపై ఉత్తర్వులు జారీ చేసి, కోట్ల రూపాయల జరిమానాలు విధించింది. బాధితులకు వడ్డీతో సహా డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. అయినా రెరా వద్ద ఇంకా 1,112 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండటం పరిస్థితి తీవ్రతను చూపుతోంది.
రెరాలో ఇంకా 1,112 కేసులు పెండింగ్..
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ఒకవైపు వరుస తీర్పులతో బిల్డర్లను హెచ్చరిస్తున్నప్పటికీ, మరోవైపు బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అధికారిక వెబ్సైట్ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు నమోదైన మొత్తం 3,093 ఫిర్యాదులలో 1,981 కేసులను పరిష్కరించి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంకా 1,112 కేసులు విచారణ దశలో పెండింగ్‌లో ఉన్నాయి. ఒకసారి బిల్డర్ చేతిలో డబ్బు చిక్కుకుపోయాక, న్యాయపోరాటం చేసి రీఫండ్ తెచ్చుకోవడానికి నెలల నుంచి ఏళ్ల తరబడి సమయం పడుతోంది. ఈలోగా బ్యాంకు ఈఎంఐలు కట్టలేక, అద్దె ఇళ్లలో ఉండలేక బాధితులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు.
భారీ జరిమానాలు విధిస్తున్న రెరా..
ఇటీవలి కాలంలో బాధితుల ఫిర్యాదులపై వేగంగా స్పందించిన రెరా నిబంధనలు ఉల్లంఘించిన బిల్డర్లకు చుక్కలు చూపించింది. భారీ జరిమానాలు వేస్తూ విక్రయాలపై నిషేధం విధించింది. వడ్డీతో సహా కోట్లలో రీఫండ్‌కు ఆదేశాలు జారీ చేసింది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్రకటనలు ఇవ్వడం, ప్రీలాంచ్ బుకింగ్‌లు తీసుకోవడం వంటి నేరాలపై సుమోటోగా కేసులు నమోదు చేసింది. ‘రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్రచారం, నిబంధనల ఉల్లంఘించడంతో సమూహా ప్రాజెక్ట్స్‌కు రూ.4.19 కోట్లు, 57 విల్లాలకు మాత్రమే అనుమతి పొందింది. 300కు పైగా విల్లాలను మార్కెటింగ్ చేయడంతో జీఎన్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ పై రూ.2.15 కోట్లు, నానక్‌రామ్‌గూడలో ప్రీ రిజిస్ట్రేషన్ బుకింగ్‌లు తీసుకున్నారు.
దీంతో సెన్సేషన్ ఇన్ఫ్రాకాన్ పై రూ.1.44 కోట్లు, రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాజెక్టుల మార్కెటింగ్ చేయడంతో మైరాన్ హోమ్స్ పై రూ.1.14 కోట్లు, అనుమతి లేని ప్రాజెక్టులకు ప్రకటనలు ఇవ్వడంపై ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ పై రూ.38.63 లక్షలు, మంచిరేవులలో రెరా నంబర్ లేకుండా 'సనాలి ది ఎడ్జ్' పేరిట విక్రయాలు జరపడంతో సనాలి ఐటీ పార్క్స్ కు రూ.25 లక్షల’ భారీ జరిమానాలు విధించింది. వాసవి రియల్టర్స్, త్రిపుర కన్స్ట్రక్షన్స్, శాండ్ స్టోన్ ఇన్ఫ్రా, ఎస్వీఎం ఆదిత్య హోమ్స్, భువన్ తేజ ఇన్ఫ్రా వంటి సంస్థలకు బాధితుల డబ్బును 10.85% వార్షిక వడ్డీతో వెనక్కి ఇవ్వాలని రెరా ఆదేశించింది.
