ఆదిలాబాద్ జిల్లాలో పరువు హత్య.. కూతురుని చంపి పొలంలో పాతిపెట్టిన తండ్రి

ఆదిలాబాద్ జిల్లాలో పరువు హత్య.. కూతురుని చంపి పొలంలో పాతిపెట్టిన తండ్రి

ఆదిలాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన.. కూతురు ప్రేమలోపడిందని, తాను తెచ్చిన సంబంధం చేసుకోలేదని కన్నబిడ్డనే దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. కన్నబిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన తండ్రి.. సమాజం ఏమనుకుంటుందోనన్న భయంతో ఆమె ప్రాణాలను బలితీసుకున్నాడు. జన్మనిచ్చిన తండ్రే ఇంత దారుణానికి ఒడిగట్టడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కైలాస్ తన కూతురు కళ్యాణికి మరో వ్యక్తితో వివాహం చేయాలని నిర్ణయించగా ఆ పెళ్లి ఒప్పుకోలేదు. కళ్యాణి తన మేనత్త కుమారుడిని ప్రేమిస్తూ, అతనితో కొంతకాలంగా సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కళ్యాణి గర్భం దాల్చింది.

కూతురు గర్భవతి అయిన విషయం బయటకు తెలిస్తే కుటుంబ పరువు పోతుందని కైలాస్ ఆందోళనకు గురై, సమాజం ముందు తలెత్తుకోలేమనే భావనతో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం కళ్యాణిని హత్య చేసి, అనంతరం ఆమె మృతదేహాన్ని పంట పొలంలో పాతిపెట్టాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో కైలాస్ నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.