అనిల్ రావిపూడి సినిమాలకు రచయితగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన ఎస్ కృష్ణ.. ‘హై’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తూ.. హరీష్ పెద్దితో కలిసి నిర్మించారు. నవంబర్ 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎస్ కృష్ణ మాట్లాడుతూ ‘యాక్టర్, డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన నాకు అనిల్ రావిపూడితో పరిచయమై రూమ్‌మేట్స్ అయ్యాం. ‘పటాస్’ నుంచి తన సినిమాలకు వర్క్ చేస్తున్నా. గతంలో పలు చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు ‘గాలి సంపత్’ అనే సినిమా నిర్మించా.
ఇప్పుడు ‘హై’తో నటుడిగా, దర్శకుడిగా పరిచయం అవుతున్నా. ఇందులో ప్రతి పాత్రకు ఒక ‘హై’ ఉంటుంది, అందుకే ఈ టైటిల్ పెట్టా. ఇదొక ఆంథాలజీ. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. జెన్-జీ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఇది సరికొత్త అనుభూతినిస్తుంది. సాధ్యమైనంత లిమిటెడ్ బడ్జెట్‌లో దీనిని పూర్తిచేశాం. నిజానికి ఒక సినిమాకు బడ్జెట్ కంటే కూడా విజన్, రైటింగ్ ముఖ్యమని నేను నమ్ముతా. అదే ఈ సినిమాకు ఫాలో అయ్యాను. సినిమా చూశాక నటుడిగా నాకు మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నా’ అని చెప్పారు.
