సినిమా అవకాశాలు రావడమే కాదు.. వచ్చిన అవకాశాలు చివరి వరకు నిలబడటం కూడా నటీనటులకు ఎంతో ముఖ్యం. ముఖ్యంగా కెరీర్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలు చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోతే ఆ బాధ వర్ణనాతీతం. తాజాగా తెలుగు నటి పూజిత పొన్నాడకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. 'ఊపిరి'తో మొదలైన పూజిత సినీ జర్నీ.. 'రంగస్థలం', 'కల్కి', 'ఓదెల రైల్వే స్టేషన్', 'రావణాసుర' వంటి చిత్రాలతో కొనసాగింది. ఈ క్రమంలో 'ఆదర్శ కుటుంబం' (AK47)లో మంచి పాత్ర దక్కిందని భావించిన ఆమె.. ఐదు రోజుల షూటింగ్ తర్వాత తనకు చెప్పకుండానే మరో నటిని తీసుకున్నారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి..
త్రివిక్రమ్ లుక్ టెస్ట్ చేసి మరీ తీసుకున్నారు.. చివరకు!
'ఆదర్శ కుటుంబం'లో తనది కీలక పాత్ర అని, సినిమా ఆద్యంతం కనిపిస్తానని రచయిత హామీ ఇచ్చినట్లు పూజిత తెలిపారు. నారా రోహిత్‌కు జోడీగా ముఖ్యమైన సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయని చెప్పడంతో అంగీకరించానని, అగ్రిమెంట్ పూర్తయి అడ్వాన్స్ అందుకున్న తర్వాత షూటింగ్లో పాల్గొన్నానని పూజిత వెల్లడించారు. ముఖ్యంగా త్రివిక్రమ్ స్వయంగా లుక్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేయడంతో పాటు, అగ్రిమెంట్ పూర్తిచేసి అడ్వాన్స్ కూడా ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చింది.
ఐదు రోజుల షూటింగ్.. మూడు నెలల నిరీక్షణ!
మొదటి షెడ్యూల్లో భాగంగా ఐదు రోజుల పాటు నారా రోహిత్‌తో కలిసి తన పాత్రకు సంబంధించిన సన్నివేశాల్లో నటించానని పూజిత తెలిపారు. ఆ తర్వాత రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూశానని చెప్పారు. అయితే రోజులు గడుస్తున్నా చిత్రబృందం నుంచి ఎలాంటి సమాచారం రాలేదట. దాదాపు మూడు నెలల పాటు షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ లేకపోవడంతో తన పాత్ర పరిస్థితి ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించానని వెల్లడించారు.
ఈ క్రమంలో కథలో మార్పులు జరుగుతున్నాయని, కొన్ని పాత్రలను మార్చే అవకాశం ఉందని వార్తలు వినిపించడంతో చిత్రబృందాన్ని సంప్రదించారట. తన పాత్ర తగ్గుతుందేమోనని అడిగితే.. తగ్గడం కాదు, ఇంకా పెరుగుతుందని, త్రివిక్రమ్ మరింత బాగా రాస్తున్నారని అసిస్టెంట్ డైరెక్టర్ భరోసా ఇచ్చినట్లు ఆమె చెప్పారు. దీంతో మళ్లీ షూటింగ్ పిలుపు కోసం ఎదురుచూసినట్లుగా చెప్పుకొచ్చింది.
చెప్పకుండానే మరో నటిని తీసుకున్నారట!
దాదాపు మూడు నెలల తర్వాత తన పాత్రలో మరో నటిని తీసుకున్నట్లు తెలిసి షాక్‌కు గురయ్యానని పూజిత తెలిపారు. ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తున్నట్లు కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. షూటింగ్లో పాల్గొన్న తర్వాత ఇలా చేయడం బాధ కలిగించిందని, పాత్రల మార్పులు ఉన్నా ముందుగానే సంబంధిత నటులకు తెలియజేయడం కనీస మర్యాద అని ఆమె అభిప్రాయపడ్డారు.
థియేటర్లలో ఒక్క సీన్.. టైటిల్స్‌లోనూ పేరు లేదట!
సినిమా విడుదలయ్యాక థియేటర్లలో తనకు సంబంధించిన ఒక్క సన్నివేశం మాత్రమే కనిపించిందని పూజిత తెలిపారు. అంతేకాదు.. సినిమా టైటిల్స్‌లో కనీసం తన పేరు కూడా లేకపోవడంతో మరింత బాధపడ్డానని వెల్లడించారు. పూర్తి స్థాయి పాత్ర ఉంటుందని నమ్మించి చివరకు ఇలా చేయడం అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ : తారక్ ఇంట్లోకి అరుదైన కళాఖండం..
టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన వివాదం..
పూజిత పొన్నాడ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా త్రివిక్రమ్, వెంకటేష్ వంటి స్టార్స్ భాగమైన సినిమాపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆసక్తి రేపుతోంది. అయితే ఈ వివాదంపై 'ఆదర్శ కుటుంబం' మేకర్స్ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. మరి పూజిత ఆరోపణలపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
