హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ నియంత్రణ కోసం కొత్త మార్పులు చేపట్టే విషయంలో పోలీస్ సిబ్బందికి భరోసా ఇస్తూ తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం (నవంబర్ 26, 2026న) జరిగిన సైబరాబాద్ మూవ్స్ 2026 సదస్సులో పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. సైబరాబాద్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో కంపెనీలు, ఉద్యోగాలు ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల రద్దీ విపరీతంగా పెరుగుతోందని డీజీపీ అన్నారు.
వేగంగా అభివృద్ధి చెందిన బెంగళూరు నగరం ప్రస్తుతం తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటోందని, హైదరాబాద్‌కు అలాంటి దుస్థితి రాకుండా ఇప్పుడే చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. ఉద్యోగులు కారులో ఆఫీసుకు రావడాన్ని స్టేటస్ సింబల్‌గా భావించకుండా, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ (ప్రజా రవాణా) వినియోగించాలని సూచించారు. వర్షాకాలంలో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ : కూకట్‌పల్లిలో ఆపిల్ ఫస్ట్ రిటైల్‌స్టోర్.. ఎక్కడ ఓపెన్ చేస్తున్నారంటే..?
ట్రాఫిక్ నియంత్రణ కోసం కొత్త ప్రయోగాలు లేదా మార్పులు చేసినప్పుడు ప్రారంభంలో ఒకటి రెండు రోజులు ప్రజలకు కొంత అసౌకర్యం కలగడం సహజమని తెలిపారు. దానికి వెనకడుగు వేయకుండా అధికారులు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని, ఆ తర్వాత కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని, ఇందుకు ఐటీ కంపెనీలు, ఉద్యోగులు పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
