పేదరికం అంటే కేవలం ఆదాయం లేకపోవడం మాత్రమే కాదు.. కనీస ఆహారం, దుస్తులు, నివాసం, విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలను తీర్చుకోలేని పరిస్థితి. అయితే పేదరికాన్ని కొలిచే ప్రమాణాలు దేశాన్ని బట్టి మారుతాయి. నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం, దారిద్ర్యరేఖ వంటి అంశాల నుంచి పేదరిక నిర్మూలనకు అమలు చేసిన ప్రభుత్వ విధానాల వరకు.. ఈ అంశాలపై అవగాహన పోటీ పరీక్షల అభ్యర్థులకు ఎంతో కీలకం. మనదేశంలో పేదరికాన్ని ఎలా అంచనా వేస్తారు? పేదరికపు రేఖను ఎలా నిర్ణయిస్తారు? పేదరికాన్ని తగ్గించేందుకు చేపట్టిన స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక చర్యలు ఏమిటి? తెలుసుకుందాం.
ఒక వ్యక్తి తన కనీస అవసరాలు తీర్చుకోవడానికి కావాల్సిన కనీస స్థాయి ఆదాయం పొందలేని స్థితిని పేదరికంగా నిర్వచిస్తారు. ప్రతి దేశంలో ఆ దేశ అభివృద్ధి స్థాయిని బట్టి పేదరికపు రేఖ మారుతుంది. కనీస సౌకర్యాల స్థాయి మారుతుంది. అమెరికాలోని కారు లేకపోవడం పేదరికంగా చెప్పవచ్చు. ఇండియాలో అదే కారు కలిగి ఉండటం ఒక విలాసంగా చెప్పవచ్చు.
నిరపేక్ష పేదరికం: వ్యక్తి జీవించడానికి కావాల్సిన కనీస జీవన ఆధార వినియోగ వ్యయం కూడా చేయలేని పరిస్థితి నిరపేక్ష పేదరికం. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపిస్తుంది.
సాపేక్ష పేదరికం: సమాజంలో పైనున్న 5 శాతం నుంచి 10 శాతం ప్రజల జీవన ప్రమాణంతో పోల్చినపుడు దిగువనున్న 5 శాతం నుంచి 10 శాతం ప్రజల జీవన ప్రమాణం తక్కువగా ఉంటుంది. దీన్నే సాపేక్ష పేదరికం అంటారు. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని లారెంజ్ వక్రరేఖ (గిని గుణకం) ద్వారా కొలవవచ్చు.
పేదరికపు రేఖ: ఒక వ్యక్తి జీవించడానికి కావాల్సిన కనీస జీవిత అవసరాలను నిర్ణయించి వాటిని పొందేందుకు చేయాల్సిన కనీస వ్యయాన్ని నిర్ధారిస్తారు. ఈ కనీస వ్యయమే దారిద్ర్యరేఖ. అంతకంటే తక్కువ వ్యయం చేసేవారిని పేదరికపు రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్నారని, అంతకంటే ఎక్కువ వ్యయం చేసేవారిని పేదరిక రేఖకు పైన (ఏపీఎల్) ఉన్నవారని పిలుస్తారు.
1969లో పౌష్టికాహార నిపుణుల సలహా మేరకు ప్రణాళికా సంఘం లభ్యమయ్యే కేలరీల శక్తిని బట్టి కనీస పోషకాహార స్థాయిని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో 2400 కేలరీలు, పట్టణ ప్రాంతాల్లో 2100 కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని ప్రాతిపదికగా తీసుకుని పేదరికాన్ని నిర్వచించింది.
1973–74 సంవత్సరాన్ని పేదరికపు గీత నిర్ణయించడంలో, జీవన ప్రమాణాన్ని అంచనా వేయడానికి ప్రాతిపదికగా తీసుకున్నారు. నాడు నెలసరి తలసరి వినియోగ వ్యయం (Monthly Percapita Consumption Expenditure -– MPCE) గ్రామాల్లో రూ.49గాను, పట్టణాల్లో రూ.56గాను తీసుకున్నారు. కాలానుగతంగా ఇది పెరుగుతూ వచ్చింది.
ఎన్ఎస్ఎస్ఓ వారి 68వ రౌండ్లో గ్రామాల్లో ఎంపీసీఈ రూ. 816 (రోజుకి రూ. 27.2)గాను, పట్టణాల్లో రూ.1000 (రూ.33.33)గానూ నిర్ణయించారు. మనదేశంలో ఎన్ఎస్ఎస్ఓ వారు ప్రతి ఐదేండ్లకు ఒకసారి లార్జ్ శాంపిల్ సర్వే ద్వారా కుటుంబ వ్యయాన్ని అంచనా వేస్తారు.
ఎన్ఎస్ఎస్ఓ వారి అంచనాలను ప్రణాళికా సంఘం అధికారికంగా ప్రకటిస్తుంది. అంటే భారత్లో పేదరికాన్ని అధికారికంగా అంచనా వేసేది ప్రణాళికా సంఘం. భారత్లో దారిద్ర్యరేఖను నిర్ణయించేటప్పుడు లభించే కనీస ఆహార స్థాయి వస్త్రాలు, పాదరక్షలు, ఇంధనం & కాంతి, విద్య, ఆరోగ్య సంబంధ అవసరాలు మొదలైన వాటిని కనీస అవసరాలుగా తీసుకుంటారు. ఈ భౌతిక పరిమాణాన్ని ధరల్లో వ్యక్తపరుస్తారు. ఆహారాన్ని మనకు లభించే కాలరీల రూపంలో అంచనా వేస్తారు. ఇక్కడ కాయ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, పాలు, నూనెలు, పంచదార మొదలైన వాటిని కేలరీల్లో అంచనా వేస్తారు. ఇవి వయసు, లింగం, పని స్వభావం అనుసరించి మారుతుంది.
పేదరికం-నివారణా చర్యలు
పేదరికపు నివారణా చర్యలను మూడు రకాలుగా చెప్పవచ్చు.
స్వల్పకాలిక చర్యలు.
మధ్యకాలిక చర్యలు
(సెల్ఫ్హెల్ప్ గ్రూప్స్ ద్వారా పేదరికం తగ్గించడం)
దీర్ఘకాలిక చర్యలు
జనాభా తగ్గించడం, వృద్ధిని వేగవంతం చేయడం ఆదాయ అసమానతలు తగ్గించడం, భూసంస్కరణల అమలు, అక్షరాస్యత పెంచడం, గ్రామీణ పారిశ్రామికీకరణ.
స్వల్పకాలిక చర్యలు
1970కి పూర్వం ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తలు ట్రికిల్ డౌన్ థియరీపై విశ్వాసం ఉంచారు. వృద్ధి జరిగితే తలసరి ఆదాయం పెరిగి అది కింది స్థాయికి ప్రవహించి పేదరికం దానంతట అదే తగ్గుతుందని తెలిపేదే ట్రిక్కిల్ డౌన్ థియరీ. 1970 నాటికి వృద్ధి జరిగింది. కానీ పేదరికం తగ్గలేదు. అంటే పేదరికాన్ని తగ్గించడంలో ఇది పని చెయ్యలేదు. అందుకే పేదరికాన్ని తగ్గించేందుకు ప్రత్యక్షంగా కొన్ని చర్యలు తీసుకోవాలని ఆర్థికవేత్తలు భావించారు. ఫలితంగా 1970వ దశకం నుంచి గ్రామీణ, పట్టణ పథకాలను ప్రవేశపెట్టారు.
– వెలుగు, ఎడ్యుకేషన్
