రేపే భారత్ vs న్యూజిలాండ్ రెండో టెస్ట్.. క్రైస్ట్‌చర్చ్‌లో పేసర్ల హవా?

రేపే భారత్ vs న్యూజిలాండ్ రెండో టెస్ట్.. క్రైస్ట్‌చర్చ్‌లో పేసర్ల హవా?

IND vs NZ 2nd Test: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రేపు (శుక్రవారం, నవంబర్ 27, 2026) నుంచి క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్ (Hagley Oval) వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఐదు రోజుల పాటు బౌలర్లు వికెట్లు తీయలేక తీవ్రంగా శ్రమించాల్సి రావడం, మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి రెండో టెస్ట్ పిచ్‌పై పడింది. ఈ నేపథ్యంలో హాగ్లే ఓవల్ హెడ్ క్యూరేటర్ జేడెన్ టోహిల్ (Jayden Tohill) ఈరోజు (నవంబర్ 26, గురువారం) జరిగిన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పిచ్ స్వభావంపై కీలక విషయాలు వెల్లడించారు.

ఇండియా-A మ్యాచ్‌ను రిఫరెన్స్‌గా తీసుకోవద్దు: క్యూరేటర్ 

మూడు వారాల క్రితం ఇదే వేదికపై భారత్-A వర్సెస్ న్యూజిలాండ్-A మధ్య జరిగిన అనధికారిక టెస్టులో పరుగుల వరద పారింది (భారత్-A 346, 282/2– ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్ సెంచరీలు; న్యూజిలాండ్-A 424). అయితే ఆ మ్యాచ్ పిచ్‌కు, ఈ టెస్టు పిచ్‌కు సంబంధం లేదని క్యూరేటర్ టోహిల్ స్పష్టం చేశారు. 

వాతావరణం వల్ల ఇబ్బంది: ఆ మ్యాచ్ ప్రిపరేషన్ సమయంలో ఒకవైపు విపరీతమైన వేడి, చివరి రెండు మూడు రోజులు ప్రతికూల వాతావరణం ఉండటంతో పిచ్ అనుకున్నట్లు రాలేదు.. కాబట్టి ఆ మ్యాచ్‌ను రిఫరెన్స్‌గా తీసుకోవద్దని టోహిల్ తేల్చి చెప్పారు. 

* శీతాకాలపు మరమ్మతులు: వింటర్ రెనోవేషన్ తర్వాత ప్రస్తుత పిచ్ చాలా అద్భుతమైన స్థితిలో ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఫస్ట్ బౌలర్లకు, నెక్ట్స్ బ్యాటర్లకు.. మిక్సడ్ పిచ్: 

* వెల్లింగ్టన్ బేసిన్ రిజర్వ్ టెస్టులో ఐదు రోజుల్లో కలిపి 1,327 పరుగులు రాగా, కేవలం 24 వికెట్లు మాత్రమే పడ్డాయి. అయితే క్రైస్ట్‌చర్చ్ పిచ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుందని క్యూరేటర్ వివరించారు. 

* సమతూకమైన పోరు: హాగ్లే ఓవల్ సాంప్రదాయం ప్రకారం, పిచ్ తొలుత బౌలర్లకు అనుకూలిస్తుంది. ఆ తర్వాత క్రమంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. బ్యాట్, బాల్ మధ్య సరైన సమతూకం ఉండేలా చూస్తున్నామని టోహిల్ తెలిపారు.

* ఫలితం రావాలన్నదే లక్ష్యం: ఐదు రోజుల పాటు కొనసాగేలా సాధారణ పిచ్‌లు వేయాలని మేము అనుకోం.. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ స్పష్టమైన ఫలితం వచ్చేలా పిచ్ ఉండాలని కోరుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గతేడాది వెస్టిండీస్‌తో ఇక్కడ జరిగిన టెస్ట్ ఐదో రోజు చివరి సెషన్ వరకు మూడు ఫలితాలకు అవకాశం ఉన్నట్లు కొనసాగిన విషయాన్ని టోహిల్ గుర్తుచేశారు.

కాకనుయ్ బంకమట్టి ప్రత్యేకత: 

* కాకనుయ్ క్లే: హాగ్లే ఓవల్ పిచ్ తయారీలో కాకనుయ్ బంకమట్టి (Kakanui clay) ఉపయోగిస్తారు. వాతావరణానికి తగ్గట్లు కుంచించుకుపోయే, వ్యాకోచించే గుణం ఉన్న ఈ నల్ల బంకమట్టి పేసర్లకు మంచి బౌన్స్, మూవ్‌మెంట్ అందిస్తుంది.

* గురువారం వర్షం: ఇప్పటి వరకు పిచ్ పనులకు వాతావరణం సహకరించినా, ఈరోజు (గురువారం) ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల గ్రౌండ్ స్టాఫ్ పనులకు స్వల్ప ఆటంకం కలిగింది. కానీ మధ్యాహ్నం తర్వాత వాతావరణం మెరుగుపడుతుందని క్యూరేటర్ ఆశాభావం వ్యక్తం చేశారు.