రూ.8 కోట్ల ఆస్తి కోసం భర్త, కొడుకుకు రోజూ కొంచెం కొంచెం విషం ఇచ్చిన భార్య

రూ.8 కోట్ల ఆస్తి కోసం భర్త, కొడుకుకు రోజూ కొంచెం కొంచెం విషం ఇచ్చిన భార్య

మారుతున్న కాలంతో పాటు మనుషుల్లో మానవత్వం మాయమవుతోంది. ముఖ్యంగా డబ్బు, ఆస్తుల కోసం కొందరు భార్యలు చేస్తున్న పనులు సమాజంలోని మగజాతినే భయభ్రాంతులకు గురిచేస్తోంది. కష్టసుఖాల్లో తోడుండాల్సిన జీవిత భాగస్వామే, ఆస్తి కోసం భర్త ప్రాణాలు తీసే స్థాయికి దిగజారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో జరిగిన ఒక ఘటన చూస్తుంటే.. మగవారికి సొంత ఇంట్లోనే రక్షణ లేకుండా పోతోందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఘాజియాబాద్‌లోని వసుంధర ప్రాంతంలో సుశీల్ కుమార్ భట్నాగర్ అనే వ్యక్తి నివసిస్తున్నారు. ఆయనకు రూ. 5 నుంచి 6 కోట్ల విలువైన ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారం ఉంది. దీంతో పాటు ఆయన పేరు మీద రూ. 2 కోట్ల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉంది. అయితే ఈ ఆస్తి, ఇన్సూరెన్స్ డబ్బుపై భార్య రేణు భట్నాగర్ కన్నుపడింది. భర్త చనిపోతే నామినీగా ఉన్న తనకే రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుతో పాటు, కోట్ల విలువైన వ్యాపారం మొత్తం సొంతమవుతుందని దురాశ పడింది.

ఇందుకోసం రేణు తన భర్తను అడ్డు తొలగించుకోవాలని పక్కా ప్లాన్ వేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, రోజువారీ ఆహారంలో విషపూరితమైన 'లెడ్' (సీసం) కలిపి భర్తకు తినిపించడం మొదలుపెట్టింది. కేవలం భర్తకే కాకుండా.. ఆస్తికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతో కన్నకొడుకు, మేనల్లుడి ఆహారంలోనూ ఈ స్లో పాయిజన్ కలిపింది.

నెలల తరబడి ఈ విషపూరిత ఆహారం తినడంతో సుశీల్ కుమార్‌తో పాటు ఆయన కొడుకు, మేనల్లుడు తరచూ అనారోగ్యానికి గురయ్యారు. ఎన్ని మందులు వాడినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో సుశీల్‌కు అనుమానం వచ్చింది. వెంటనే పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేయించుకోగా, ఆయన శరీరంలో ప్రమాదకర స్థాయిలో లెడ్ ఉన్నట్లు రిపోర్టుల్లో తేలింది. ఇది తన భార్య, ఆమె కుటుంబ సభ్యుల పనేనని గ్రహించిన సుశీల్.. 2026 సెప్టెంబర్ 24న ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

2 నెలల దర్యాప్తు తర్వాత పోలీసులు నవంబర్ 23న రేణు భట్నాగర్‌ను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. డబ్బుపై అత్యాసతోనే భర్త, కొడుకు, మేనల్లుడిని చంపడానికి ఆహారంలో లెడ్ కలిపినట్లు ఒప్పుకుంది. ఈ కుట్రలో ఆమె కుటుంబ సభ్యుల పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పచ్చని సంసారాన్ని డబ్బు కోసం బలితీసుకోవాలని చూసిన ఈ భార్య క్రూయెల్ మైండ్ సెట్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇలా బయటపడని కేసులు సమాజంలో ఎన్ని జరుగుతున్నాయో అంటూ భార్యా బాధిత భర్తలు ఆందోళన చెందుతున్నారు.