తెలంగాణలో తన మొదటి రిటైల్ స్టోర్‌ను డిసెంబర్ 10న ప్రారంభించనున్నట్లు ఆపిల్ గురువారం ప్రకటించింది. కూకట్‌పల్లిలోని లేక్‌షోర్- వైజంక్షన్ మాల్లో ఆపిల్ కూకట్పల్లి పేరుతో ఈ స్టోర్ అందుబాటులోకి రానుంది. భారత్‌లో ఇది 7వ స్టోర్ అని ఆపిల్ తెలిపింది. దేశవ్యాప్తంగా తన రిటైల్ నెట్‌వర్క్‌ను విస్తరించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఈ స్టోర్ లో కంపెనీకి చెందిన అన్ని రకాల ఉత్పత్తులు, సేవలు లభిస్తాయి. కస్టమర్లకు సాంకేతిక సహకారం అందించడానికి నిపుణులు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, బిజినెస్ టీమ్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయని ఆపిల్ వెల్లడించింది. హైదరాబాద్‌కు పెర్ల్ సిటీగా ఉన్న పేరును ప్రతిబింబించేలా ఈ స్టోర్లోగోను డిజైన్ చేశారు. ముత్యం ఆకారంలో ఉండే ఆపిల్ లోగోను స్టోర్ బయట ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది.
హైదరాబాద్‌లో ఇప్పటికే ఆపిల్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్, రిటైల్ కస్టమర్ కేర్ టీమ్స్ పనిచేస్తున్నాయి. తమ భారత్ కార్యకలాపాల్లో ఈ నగరానికి ప్రత్యేక స్థానం ఉందని ఆపిల్ వివరించింది. ఫోటోగ్రఫీ, వీడియో క్రియేషన్, డ్రాయింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు టుడే ఎట్ ఆపిల్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తారు. ఇక్కడ కస్టమర్లు ఉచితంగా శిక్షణ పొందవచ్చని కంపెనీ తెలిపింది.
ముంబై, ఢిల్లీ-ఎన్ సీఆర్, బెంగళూరు, పూణే నగరాల్లో ఇప్పటికే ఆపిల్ రిటైల్ స్టోర్లు ఉన్నాయి. ఫిజికల్ స్టోర్లు, ఆన్లైన్ ఛానెల్స్ ద్వారా కస్టమర్లతో సంబంధాలను బలోపేతం చేసుకోవడమే తమ లక్ష్యమని ఆపిల్ పేర్కొంది. ప్రారంభోత్సవానికి ముందు హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించేలా డిజిటల్ కంటెంట్‌ను కంపెనీ విడుదల చేసింది. ఇందులో ప్రత్యేక వాల్ పేపర్లు, స్టిక్కర్లు, మ్యూజిక్ ప్లే లిస్ట్ ఉన్నాయి. డిసెంబర్ 10న సాయంత్రం 5 గంటలకు ఆపిల్ కూకట్పల్లి స్టోర్‌ను వినియోగదారుల కోసం తెరుస్తారని కంపెనీ స్పష్టం చేసింది.
