జానపద కళకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాల్లో బుర్రకథకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాంటి ఓ అరుదైన జానపద కళాకారిణి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిన చిత్రమే ‘గరివిడి లక్ష్మి’. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బయోపిక్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ గురువారం (నవంబర్ 26) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంది.
ఆనంది వన్ విమెన్ షో..
ఈ సినిమాకు ప్రధాన బలం ఆనంది నటన. ముఖ్యంగా ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతూ, బుర్రకథలు చెబుతూ, జానపద పాటలు పాడుతూ గరివిడి లక్ష్మి పాత్రకు ప్రాణం పోసింది. పాత్రలోని భావోద్వేగాలు, సంఘర్షణను అద్భుతంగా పలికించింది. మొత్తంగా ఈ సినిమా ఆనంది కెరీర్‌లో గుర్తుండిపోయే నటనగా నిలుస్తుంది.
A legendary voice that transformed Burrakatha into a movement and touched thousands of hearts! ❤️ Witness the inspiring journey of #GarividiLakshmi, streaming November 26 on Prime Video! 🔥 #GarividiLakshmiOnPrime #PrimeVideo @peoplemediafcy @vishwaprasadtg #KrithiPrasad @anandhiactress @smayurk @gowrinaidujammu @CharanArjunwave @ItsActorNaresh @AnkithKoyyaLive @sujithkolli #Raasi @Ananyabhat14 #SharanyaPradeep @kishorepolimera @BonguSathi @tseriessouth
— People Media Factory (@peoplemediafcy) November 25, 2026
థియేటర్లలో మంచి స్పందన.. ఇప్పుడు ఓటీటీలో..
అక్టోబర్ 17న దసరా కానుకగా విడుదలైన ‘గరివిడి లక్ష్మి’కి ఉత్తరాంధ్రలో మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా స్థానిక ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది. బుర్రకథలు, జానపద పాటలు, ఉత్తరాంధ్ర సంస్కృతి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు ఈ బయోపిక్ ఓటీటీలోకి రావడంతో మరింత మంది ప్రేక్షకులకు చేరువ కానుంది.
గరివిడి లక్ష్మి’ కథేంటి?
కొన్ని జీవితాలు కాలగర్భంలో కలిసిపోతాయి.. మరికొన్ని జీవితాలు చరిత్రలో నిలిచిపోవాల్సినవైనా, తగిన గుర్తింపునకు నోచుకోవు. అలాంటి ఓ అసాధారణ జానపద కళాకారిణి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నమే ‘గరివిడి లక్ష్మి’.
విజయనగరం జిల్లా గరివిడికి చెందిన విజయలక్ష్మి (ఆనంది) చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంది. తండ్రి ప్రేమకు దూరమై, బాల్య వివాహం తర్వాత వైవాహిక జీవితంలోనూ చేదు అనుభవాలను చవిచూస్తుంది. అయితే, ఆ బాధలే ఆమె ప్రయాణానికి ముగింపు కావు. పాటపై ఉన్న మక్కువ, అసాధారణమైన ప్రతిభ ఆమెను బుర్రకథ కళాకారిణిగా తీర్చిదిద్దుతాయి. తన గళంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లక్ష్మి జీవితంలోకి సత్తిబాబు (రాగ్ మయూర్), రాంబాబు (నరేష్) రావడంతో కథ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంది.
నమ్మినవారి వల్ల ఎదురైన మోసాలు, తన కళకు దక్కాల్సిన గుర్తింపు దూరమవడం ఆమె జీవితాన్ని ఎలాంటి సంక్షోభంలోకి నెట్టాయి? చివరకు ఆమె అజ్ఞాతంలోకి వెళ్లడానికి కారణమేంటి? లక్ష్మి జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్న దర్శకుడు రాజేష్ (అంకిత్ కొయ్య) ప్రయత్నం ఫలించిందా? వంటి ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే సినిమా చూడాల్సిందే..
