ఒకవైపు వెండితెరపై రామాయణ గాథతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ.. మరోవైపు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ (Ramayana: Rise of a Legend). ఈ క్రమంలో చిత్ర బృందానికి మరో అరుదైన గౌరవం దక్కింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో నటించిన సాయి పల్లవి, దర్శకుడు నితేశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
అమిత్ షాతో ప్రత్యేక భేటీ..
నవంబర్ 25న ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేశ్ తివారీ, నటులు రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవితో పాటు సహ నిర్మాత నీరజ్ సంఘాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నమిత్ మల్హోత్రా అమిత్ షాకు పుష్పగుచ్ఛం అందించగా.. దర్శకుడు నితేశ్ తివారీ శాలువాతో సత్కరించినట్లు సమాచారం. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ఇంత భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించిన చిత్ర బృందాన్ని అమిత్ షా అభినందించారు. రామాయణ చరిత్ర, దాని సాంస్కృతిక ప్రాధాన్యతపై ఆయనకున్న పరిజ్ఞానం తమను ఆకట్టుకుందని చిత్ర బృందం పేర్కొంది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోలు..
ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను ‘ది వరల్డ్ ఆఫ్ రామాయణ’ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. ‘‘దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విశేష ఆదరణ పొందుతున్న మా ‘రామాయణ’ చిత్ర బృందానికి హోంమంత్రి అమిత్ షాను కలవడం గౌరవంగా భావిస్తున్నాం’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోల్లో రణ్‌బీర్ కపూర్ సంప్రదాయ బంధ్‌గలా దుస్తుల్లో కనిపించగా.. సాయి పల్లవి గులాబీ రంగు చీరలో సంప్రదాయంగా మెరిశారు. ఆమె ధరించిన బంగారు ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Team Ramayana was honoured to meet Home Minister Shri @AmitShah as the film continues to receive immense love across the country and in cinemas worldwide. https://t.co/jSiTpGH16w
— The World Of Ramayana (@WorldOfRamayana) November 26, 2026
బాక్సాఫీస్ వద్ద రూ.1,755 కోట్ల వసూళ్లు..
నవంబర్ 5న విడుదలైన ‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. 21 రోజుల్లో భారత్‌లో రూ.982.55 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.1,755.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ వసూళ్లతో ‘పుష్ప 2’ లైఫ్‌టైమ్ కలెక్షన్లను అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో నాలుగో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం రూ.1,788 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘బాహుబలి 2’ రికార్డుపై కన్నేసింది. భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.1,000 కోట్ల నెట్ మార్కును అందుకోవడానికి మరో రూ.17.45 కోట్లు మాత్రమే అవసరం.
ALSO READ : త్రివిక్రమ్ సినిమాతో చేదు అనుభవం
భారీ తారాగణంతో ‘రామాయణ’..
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్‌బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించారు. సన్నీ డియోల్, రవీ దూబే, కాజల్ అగర్వాల్, లారా దత్తా కీలక పాత్రలు పోషించారు. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందించారు. రెండో భాగం 2028 దీపావళికి విడుదల కానుంది. ఇలా భారీ వసూళ్లతో పాటు ప్రత్యేక గుర్తింపుతో ‘రామాయణ’ టీమ్ వార్తల్లో నిలుస్తోంది.
Your response has made this journey truly special. 🙏 Book your tickets now! 🏹 Ramayana, now playing in cinemas worldwide, across all premium formats. Source: Filmy Masala’s YouTube Channel https://t.co/iqDsiZThMT
— The World Of Ramayana (@WorldOfRamayana) November 25, 2026
