హాకీ ఇండియా లీగ్ రీఎంట్రీ.. ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధం.. జనవరిలోనే కొత్త సీజన్! 

హాకీ ఇండియా లీగ్ రీఎంట్రీ.. ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధం.. జనవరిలోనే కొత్త సీజన్! 

Hockey India League: హీరో హాకీ ఇండియా లీగ్ (Hero HIL) 2026/27 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్, నిబంధనలను నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఎడిషన్‌లో పురుషుల విభాగంలో 6 ఫ్రాంచైజీలు, మహిళల విభాగంలో 4 ఫ్రాంచైజీలు బరిలోకి దిగుతున్నాయి. స్వదేశీ, విదేశీ హాకీ ప్రతిభకు పెద్ద వేదికగా నిలుస్తున్న ఈ లీగ్ జనవరిలో తిరిగి ప్రారంభం కానుండటంతో, ఇప్పుడు ఆటగాళ్ల ట్రేడింగ్, వేలం (Auction) ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. 

ట్రేడింగ్, రిలీజ్, వేలం: 

* నవంబర్ 29: ఆటగాళ్ల ట్రేడింగ్ గురించి ఇతర ఫ్రాంచైజీలకు నేరుగా సమాచారం అందించాల్సిన గడువు. మధ్యాహ్నం 12 గంటలకు అధికారిక ట్రేడింగ్ విండో ఓపెన్ అవుతుంది.

* డిసెంబర్ 2: ఉదయం 10 గంటలకు ట్రేడింగ్ విండో ముగుస్తుంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితా, తుది జట్టు వివరాలను HILకు సమర్పించాలి.. అదే రోజు సాయంత్రం 5 గంటలకు క్రోడీకరించిన వేలం జాబితాను ఫ్రాంచైజీలకు పంపుతారు.

* డిసెంబర్ 3: వేలం కోసం ప్లేయర్స్ లిస్టును ఖరారు చేసేందుకు సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుంది. రాంచీ రాయల్స్ పురుషుల జట్టు, హీరో HIL గవర్నింగ్ కౌన్సిల్ జట్టు ఆటగాళ్లు కూడా వేలం జాబితాలో చేరతారు.

సాలరీ క్యాప్, బేస్ ప్రైస్: 

* 2026/27 సీజన్ కోసం ఫ్రాంచైజీల ఖర్చు పరిమితులు, బేస్ ప్రైస్ వివరాలను స్పష్టం చేశారు. 

* సాలరీ క్యాప్: పురుషుల ఫ్రాంచైజీకి రూ. 4 కోట్లు, మహిళల ఫ్రాంచైజీకి రూ. 2 కోట్లు గరిష్ట పరిమితిగా నిర్ణయించారు.

* బేస్ ప్రైస్ కేటగిరీలు: వేలంలోకి వచ్చే ఆటగాళ్లకు రూ. 2 లక్షలు, రూ. 5 లక్షలు, రూ. 10 లక్షలుగా బేస్ ప్రైస్ నిర్ణయించారు.

లీగ్ రీఎంట్రీతో హర్మన్‌ప్రీత్, సలీమా సంతోషం: 

2027 జనవరిలో లీగ్ తిరిగి రావడంపై భారత హాకీ కెప్టెన్లు హర్మన్‌ప్రీత్, సలీమా ఆనందం వ్యక్తం చేశారు. 

* హర్మన్‌ప్రీత్ సింగ్ (పురుషుల కెప్టెన్): జనవరిలో హీరో హాకీ ఇండియా లీగ్ మళ్లీ రావడం గొప్ప విషయం. ప్రపంచస్థాయి అంతర్జాతీయ తారలతో కలిసి మన ఆటగాళ్లు ఆడే అవకాశం లభిస్తుంది. పెద్ద అంతర్జాతీయ టోర్నీలకు సిద్ధమయ్యేందుకు ఈ అనుభవం ఎంతో విలువైనదని పేర్కొన్నారు.

* సలీమా టెటే (మహిళల కెప్టెన్): దేశీయ, అంతర్జాతీయ ప్రతిభతో కలిసి పోటీ పడేందుకు HIL గొప్ప వేదిక. ముఖ్యంగా మహిళల పోటీలు తమ సత్తా చాటుకోవడానికి, మరింత మంది యువతుల హాకీ కలను నిజం చేయడానికి దోహదపడతాయని చెప్పుకొచ్చింది.