ఫుడ్‌లో ఏముందో ప్యాకెట్లపై పెద్ద అక్షరాలతో రాయండి: సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్

ఫుడ్‌లో ఏముందో ప్యాకెట్లపై పెద్ద అక్షరాలతో రాయండి: సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్

సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై ప్యాకెట్ ముందు భాగంలో పోషకాహార లేబులింగ్ ను అమలు చేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఫ్యాట్, షుగర్, ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలకు విడివిడిగా హెచ్చరిక గుర్తులతో లేబుళ్లు వేయాలని జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్ ధర్మాసనం ఆదేశించింది.

ఒక్కో పోషకానికి ఒక్కో హెక్సాగాన్ ఆకారంలో హెచ్చరిక గుర్తు ఉండాలని కోర్టు తెలిపింది. వాటిపై 'హై ఫ్యాట్', 'హై షుగర్', 'హై సాల్ట్' అని స్పష్టంగా రాయాలని పేర్కొంది. పోషకాల పరిమితిని నిర్ణయించేటప్పుడు కేవలం అదనంగా కలిపిన షుగర్, ఫ్యాట్ కాకుండా.. అమ్ముతున్న పదార్థంలోని మొత్తం షుగర్, సాచురేటెడ్ ఫ్యాట్ వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించింది.

పోషకాల పరిమితి మరీ తక్కువగా ఉండకూడదని, మరీ ఎక్కువగా ఉండకూడదని కోర్టు తెలిపింది. పరిమితి తక్కువగా ఉంటే దాదాపు అన్ని ప్యాక్డ్ ఫుడ్స్ పై హెచ్చరికలు వస్తాయని పేర్కొంది. దీనివల్ల వినియోగదారులు లేబుళ్లను పట్టించుకోరని వివరించింది. అదే పరిమితి ఎక్కువగా ఉంటే హానికరమైన పదార్థాలు కూడా హెచ్చరికలు లేకుండా తప్పించుకుంటాయని.. ఇది ప్రజారోగ్యానికి ప్రమాదకరమని కోర్టు హెచ్చరించింది.

లేబుల్ పరిమాణం..
లేబుల్ పరిమాణం ప్యాకెట్ ముందు భాగంలో 4 శాతం నుంచి 5 శాతం వరకు ఉండాలని కోర్టు ఆదేశించింది. వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ఫాంట్ సైజు ఉండాలని FSSAIకి సూచించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (లేబులింగ్ అండ్ డిస్ ప్లే) రెగ్యులేషన్స్, 2020 నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కేంద్రానికి స్పష్టం చేసింది.

పిల్లల్లో అవగాహన..
పిల్లల్లో పోషకాహార అవగాహన పెంచేందుకు పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని కోర్టు ఆదేశించింది. వర్క్‌షాప్‌లు, ఇతర కార్యక్రమాల ద్వారా పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై పిల్లలకు అవగాహన కల్పించాలని కేంద్రానికి సూచించింది. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను వాటి తయారీ విధానం ఆధారంగా వర్గీకరించాలని కోరింది.

ALSO READ : లాభాలు ఆకాశానికి.. షేర్లు పాతాళానికి

'3ఎస్ అండ్ అవర్ హెల్త్ సొసైటీ' అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై సెప్టెంబర్ 28న రిజర్వ్ చేసిన తీర్పును కోర్టు వెలువరించింది. పిటిషనర్ తరపున అడ్వకేట్ రాజీవ్ శంకర్ ద్వివేది వాదనలు వినిపించారు. సెప్టెంబర్ 10న జరిగిన విచారణలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ పరిమితులపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఆహార పదార్థాలను అవి తయారైన విధానాన్ని బట్టి వివిధ గ్రూపులుగా వర్గీకరించడంపై క్లారిటీ కోరింది. ముసాయిదా నిబంధనల పురోగతిపై 10 వారాల తర్వాత అఫిడవిట్ దాఖలు చేయాలని FSSAIని కోర్టు ఆదేశించింది.