తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి భారీ స్వర్ణ కానుక అందింది. చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 121 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించారు. వజ్రాలు కూడా పొదిగిన ఈ ఆభరణాల విలువ రూ.206 కోట్లని ముఖ్యమంత్రి వెల్లడించారు. టీటీడీ అర్చకులు, ప్రతినిధులు ఆభరణాలను స్వీకరించారు. అనంతరం జైన్ దంపతులతో కలిసి మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. తిరుమలలో ఇదొక అపూర్వ ఘట్టమని అభివర్ణించారు.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి చెన్నైకి చెందిన జైన్ దంపతులు భక్తిశ్రద్ధలతో స్వర్ణాభరణాలను కానుకగా అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ అర్చకులు, ప్రతినిధులు ఆభరణాలను స్వీకరించారు.
అనంతరం తిరుమలలో వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులతో కలిసి ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. శ్రీవారికి ఇంత భారీ కానుక సమర్పించిన దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. 121 కిలోల బంగారు ఆభరణాల్లో విలువైన వజ్రాలు కూడా ఉన్నాయని, వాటి విలువ రూ.206 కోట్లని చెప్పారు. దైవ ఆదేశంగా భావించి ఈ కానుకను సమర్పించినట్లు జైన్ దంపతులు తనతో చెప్పారని చంద్రబాబు తెలిపారు.
తిరుమల అంటే భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక ఆనందమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్వామివారికి ప్రతిరోజూ సుమారు 120 కిలోల బంగారు ఆభరణాలను అలంకరిస్తారని చెప్పారు. ఈ అపూర్వ కార్యక్రమంలో తాను భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
భూలోక వైకుంఠం తిరుమల క్షేత్రంలో కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు 121 కిలోల బంగారాన్ని విరాళంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో శ్రీవారికి సమర్పించారు. #Tirumala #TTD #SriVenkateswaraSwamy #GoldDonation #Govinda #Tirupati #VardhmanJain #RadhikaJain #TTDOfficialUpdates
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) November 26, 2026
శ్రీవారికి కానుకలు సమర్పించే సంప్రదాయానికి సుదీర్ఘ చరిత్ర ఉందని చంద్రబాబు గుర్తుచేశారు. పల్లవ, చోళ, చేర, పాండ్య రాజులు ఆలయ అభివృద్ధికి కృషి చేశారని, మైసూర్, మరాఠా రాజులు ఆభరణాలు, ఆస్తులు కానుకగా ఇచ్చారని తెలిపారు. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన రత్నకిరీటం, పీతాంబరానికి ఎంతో చరిత్ర ఉందన్నారు. నాటి రాజుల నుంచి నేటి భక్తుల వరకు శ్రీవారిపై భక్తి, విశ్వాసాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.
