ఏపీలో తొలివిడత పంచాయితీ ఎన్నికలు రాజకీయ అలజడి రేపుతున్నాయి... పోలింగ్ కేంద్రాల దగ్గర అధికార ప్రతిపక్ష వర్గాల మధ్య ఘర్షణల కారణంగా వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో నంద్యాల జిల్లా అహోబిలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.అహోబిలం పరిధిలోని పోలింగ్ కేంద్రాల దగ్గర రిగ్గింగ్ ఆరోపణలు రావడంతో ఎమ్మెల్యే అఖిలప్రియ పోలింగ్ కేంద్రానికి చేరుకోవడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే వాహనంపై గుర్తుతెలియని వ్యక్తుల రాళ్ల దాడి చేయడం కలకలం రేపింది.
రాళ్ల దాడిలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఎమ్మెల్యే వాహనంతో పాటు మరో మూడు కార్ల అద్దాలు పగలగొట్టారు దుండగులు. ఇరువర్గాల మధ్య పరస్పర రాళ్ల దాడితో అహోబిలంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడిలో ఎమ్మెల్యే డ్రైవర్‌తో పాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
జమ్ములదిన్నెలో గందరగోళం
జమ్ములదిన్నెలో పోలింగ్ కేంద్రాల దగ్గర అధికార ప్రతిపక్షాల మధ్య ఘర్షణ గందరగోళానికి దారి తీసింది. వైసీపీ మద్దతుదారులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో పరస్పరం కారం పొడి చల్లుకుంటూ దాడులకు దిగారు ఇరువర్గాల నాయకులు. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా పోలింగ్ నిలిపివేశారు అధికారులు.
మాజీ ఎమ్మెల్యే గంగుల హౌస్ అరెస్ట్..!
అహోబిలంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో పోలింగ్ కేంద్రాల దగ్గరికి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసులు హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కాన్వాయ్ తో పోలింగ్ కేంద్రాల దగ్గరికి బయలుదేరారు గంగుల బిజేంద్ర రెడ్డి. దీంతో స్థానిక ఎన్నికల సందర్భంగా అహోబిల పుణ్యక్షేత్రం రణరంగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు, భక్తులు.
