చైనాకు ఎన్విడియా చిప్స్ అక్రమ తరలింపు.. జయ్ పురి చైనీస్ భార్యపై పెరిగిన ఫోకస్

చైనాకు ఎన్విడియా చిప్స్ అక్రమ తరలింపు.. జయ్ పురి చైనీస్ భార్యపై పెరిగిన ఫోకస్

ఎన్విడియాలో జేసన్ హువాంగ్ వ్యవహారం తర్వాత మరో కీలక పరిణామం సంచలనం రేపుతోంది. ఆ కంపెనీలో చిప్స్ అమ్మకాల విభాగాన్ని పర్యవేక్షించే సీనియర్ ఎగ్జిక్యూటివ్ జయ్ పురి(71) తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చిప్స్ సరఫరా చేసే 'సూపర్ మైక్రో కంప్యూటర్' సంస్థ ప్రతినిధి సెన్లీ చెన్‌తో ఆయనకున్న వ్యక్తిగత సంబంధం, వివాహం వివాదాస్పదంగా మారడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. సెన్లీ చైనా పౌరురాలు కావటం ఆమె పనిచేసిన అమెరికన్ కంపెనీ నుంచి చిప్స్ అక్రమంగా రవాణా కావటంతో ఇప్పుడు ఆమెపై ఫోకస్ పెరిగింది.

ఎన్విడియా చిప్స్ కోసం సూపర్ మైక్రో సంస్థ పోటీ పడుతున్న సమయంలోనే.. ఆ కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సెన్లీ చెన్‌తో జయ్ పురి డేటింగ్‌లో ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. వీరిద్దరూ మార్చి 7న కాలిఫోర్నియాలో వివాహం చేసుకున్నారు. అయితే వ్యాపార ప్రయోజనాల మధ్య సంఘర్షణ తలెత్తడం, యాజమాన్యంతో విభేదాల కారణంగా జయ్ పురి జూన్ చివరిలో తన పదవి నుంచి తప్పుకుని.. ప్రస్తుతం సీనియర్ సలహాదారుగా కొనసాగుతున్నారు.

సింగపూర్‌కు చెందిన ఒక సంస్థ ద్వారా చైనాకు 2.5 బిలియన్ డాలర్ల విలువైన సర్వర్లను అక్రమంగా విక్రయించారనే ఆరోపణలు సూపర్ మైక్రో ఉద్యోగులపై ఉన్నాయి. ఇందులో ఎన్విడియాకు చెందిన 500 మిలియన్ డాలర్ల విలువైన అత్యాధునిక జీపీయూ చిప్స్‌ను ఉపయోగించినట్లు అమెరికా న్యాయ విభాగం గుర్తించింది. ఈ కేసులో సూపర్ మైక్రో సహ వ్యవస్థాపకుడు, సేల్స్ మేనేజర్‌పై ఇప్పటికే అభియోగాలు నమోదయ్యాయి.

ఈ అక్రమ రవాణా కేసులో భాగంగా సెన్లీ చెన్ పాత్రపై అమెరికా దర్యాప్తు సంస్థ FBI ఆరా తీస్తోంది. ఆమె ఎన్విడియా ఆఫీసులకు వచ్చినప్పుడు జయ్ పురిని కలిసేవారని సహచరులు చెబుతున్నారు. అయితే తన వ్యక్తిగత జీవితానికి, వృత్తికి ఎలాంటి సంబంధం లేదని, వ్యాపార ప్రయోజనాల కోసం బంధాలను వాడుకోలేదని సెన్లీ చెన్ స్పష్టం చేశారు. ప్రయోజనాల కోసం వ్యక్తిగత సంబంధాలను ఎప్పుడూ ఉపయోగించుకోలేదని ఆమె ఒక ఈమెయిల్ ద్వారా తెలిపారు. ఫెడరల్ ఏజెన్సీలు తనను సంప్రదించలేదని ఆమె చెప్పారు. తాము బాధితులమని, నిందితులతో సంబంధాలు తెంచుకున్నామని సూపర్ మైక్రో ప్రకటించింది.