ఓ వైపు గబ్బిళాల గుంపులు.. మరోవైపు అతీంద్రియ శక్తుల ఆవహింపు.. 5 వేల ఏళ్ల నాటి పురాతన రహస్యాలు.. వెన్నులో వణుకు పుట్టించే విజువల్స్! ఇలా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన నాగ చైతన్య ‘వృషకర్మ’ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘విరూపాక్ష’తో హారర్, మిస్టరీ జానర్లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు కార్తీక్ వర్మ దండు.. ఈసారి అంతకుమించిన భారీ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా కార్తీక్ దండు విజన్, నాగ చైతన్య సరికొత్త లుక్, అద్భుతమైన విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
గబ్బిళాలతో భయపెట్టిన కార్తీక్ దండు..
‘విరూపాక్ష’ సినిమాలో కాకులు, క్షుద్రపూజల నేపథ్యంలో భయానక వాతావరణాన్ని సృష్టించిన కార్తీక్ దండు.. ‘వృషకర్మ’లో గబ్బిళాలతో మరోసారి భయపెట్టే ప్రయత్నం చేశారు. ట్రైలర్ ప్రారంభంలోనే గబ్బిళాల గుంపులు, ఓ చిన్నారిని ఆవహించిన అతీంద్రియ శక్తి, అంతుచిక్కని సంఘటనలు ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. పురాతన గుహలు, వింత శిలాశాసనాలు, చేతబడి బొమ్మలు, భయానకమైన నేపథ్యం చూస్తుంటే ఈసారి దర్శకుడు మరింత విస్తృతమైన మిస్టరీ ప్రపంచాన్ని సృష్టించినట్లు కనిపిస్తోంది.
5 వేల ఏళ్ల నాటి రహస్యం.. కథేంటి?
సుమారు 5 వేల సంవత్సరాల క్రితం నాటి ఓ అతీంద్రియ శక్తికి సంబంధించిన రహస్యం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతున్నట్లు ట్రైలర్ వెల్లడిస్తోంది. పురాతన తవ్వకాల్లో బయటపడిన గుహలు, వాటిలోని వింత గుర్తులు కథలో కీలకంగా మారనున్నాయి. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు అర్జున్ అనే ట్రెజర్ హంటర్ రంగంలోకి దిగుతాడు. అయితే అతడి అన్వేషణ క్రమంగా మానవాళికే ముప్పుగా మారిన ఓ భయంకరమైన శక్తితో పోరాటంగా మారుతుంది. ఈ క్రమంలో వేద విజ్ఞానం, పురాణ రహస్యాలు, అతీంద్రియ శక్తుల ప్రస్తావన ఆసక్తికరంగా మారింది.
సృష్టి ధర్మాన్ని కాపాడే యోధుడిగా నాగ చైతన్య..
ఈ సినిమాలో నాగ చైతన్య ‘అర్జున్’ అనే ట్రెజర్ హంటర్‌గా కనిపించనున్నారు. ఇప్పటివరకు ఆయన చేసిన పాత్రలకు భిన్నంగా రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకున్నారు. గుహల అన్వేషణ, ప్రమాదకరమైన సాహసాలు, అతీంద్రియ శక్తులతో పోరాటం వంటి సన్నివేశాల్లో చైతూ కొత్తగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా కథ ముందుకు సాగేకొద్దీ అర్జున్ పాత్రలో వచ్చే మార్పులు ఆసక్తికరంగా ఉండనున్నాయి.
‘‘మనకు అందని సైన్స్ సార్ వాళ్లది.. వేదిక్ సైన్స్’’ అనే డైలాగ్ కథలో వేద విజ్ఞానానికి ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ఇక ‘‘సృష్టి ధర్మాన్ని కాపాడటం కోసం సాక్షాత్తు ఆ దైవమే ఎంచుకున్న వృషకర్మవి నువ్వే’’ అనే డైలాగ్ హీరో పాత్రలోని అసలు కోణాన్ని పరిచయం చేస్తోంది. సాధారణ ట్రెజర్ హంటర్‌గా మొదలైన అర్జున్ ప్రయాణం.. సృష్టి ధర్మాన్ని కాపాడే దైవశక్తిగా మారడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
కార్తీక్ దండు విజన్.. నెక్స్ట్ లెవల్!
‘విరూపాక్ష’తో ప్రేక్షకులను భయపెట్టిన కార్తీక్ దండు.. ఈసారి మైథాలజీ, సూపర్ నేచురల్ అంశాలను కలిపి ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పురాతన గుహలు, శిలాశాసనాలు, వింత ఆకారాలు, అతీంద్రియ శక్తులకు సంబంధించిన సన్నివేశాలు ఆయన విజన్‌ను తెలియజేస్తున్నాయి. ఈ సినిమా కోసం భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మరింత బలాన్ని ఇచ్చాయి.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా కథను సుకుమార్ అందించారు. దర్శకుడిగా కార్తీక్ దండు, కథా రచయితగా సుకుమార్ కలవడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
భారీ తారాగణం.. డిసెంబర్ 4న విడుదల
ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా.. ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించనున్నారు. జయరామ్, సత్య, కియారా ఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.
డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘వృషకర్మ’ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. మరి ‘విరూపాక్ష’ మ్యాజిక్‌ను కార్తీక్ దండు మరోసారి రిపీట్ చేస్తారా? నాగ చైతన్యకు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి!
