అమెరికాలో మరోసారి టీ20 ప్రపంచకప్

అమెరికాలో మరోసారి టీ20 ప్రపంచకప్

T20 World Cup: రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ విశ్వవిజేతగా నిలిచిన 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత, సరిగ్గా పదేళ్లకు మరోసారి అమెరికా (USA), వెస్టిండీస్ (West Indies) సంయుక్తంగా 2034 టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2034) కు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.12వ ఎడిషన్‌గా జరగనున్న ఈ మెగా టోర్నీకి ఉత్తర అమెరికా దేశాలను వేదికలుగా ఖరారు చేసే దిశగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అడుగులు వేస్తోంది. 2034 జూలై 6 నుంచి ఆగస్టు 6 వరకు ఈ టోర్నీ జరిగే ఛాన్స్ ఉంది. 

యూరప్ తప్పుకోవడంతో యూఎస్– వెస్టిండీస్‌కు లైన్ క్లియర్: 

* గత నెలలో 2035 వరకు జరగబోయే అన్ని ఐసీసీ టోర్నీల తేదీలను ఐసీసీ ప్రకటించినప్పటికీ, 2032–2035 మధ్య టోర్నీల ఆతిథ్య దేశాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. 

* వాతావరణం కీలకం: 2034 టీ20 వరల్డ్ కప్‌ను జూలై 6 నుంచి ఆగస్టు 6 వరకు షెడ్యూల్ చేశారు. ఆ సమయంలో ఉండే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, ఈ టోర్నీని కేవలం యూరప్ లేదా ఉత్తర అమెరికాలో మాత్రమే నిర్వహించే ఛాన్స్ ఉంది. 

* నో చెప్పిన ECB: 2030 టీ20 వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఆతిథ్యమిస్తున్నందున, 2034 టోర్నీ బిడ్డింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) స్పష్టం చేసింది. దీంతో కొత్త మార్కెట్లలో క్రికెట్‌ను విస్తరించాలని చూస్తున్న ఐసీసీ, అమెరికా క్రికెట్ (USA Cricket), క్రికెట్ వెస్టిండీస్ (CWI) వైపు ఇంట్రెస్ట్ చూపుతోంది.

అమెరికాలో మరిన్ని మ్యాచ్‌లు.. షారుఖ్ ఖాన్ స్టేడియం ఎంట్రీ: 

* 2024 ఎడిషన్‌లో వెస్టిండీస్ 39 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వగా, అమెరికాలో 16 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. కానీ 2034లో అమెరికా వాటా భారీగా పెరగనుంది. 

* MLC రాకతో కొత్త మైదానాలు: మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ప్రారంభమైన తర్వాత అమెరికాలో కొత్త క్రికెట్ స్టేడియాలు అందుబాటులోకి వస్తున్నాయి.

* నైట్ రైడర్స్ స్టేడియం (Knight Riders Stadium): 128 ఏళ్ల తర్వాత 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ ద్వారా క్రికెట్ మళ్లీ ఒలింపిక్స్‌లోకి అడుగుపెడుతోంది. ఒలింపిక్స్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్న లాస్ ఏంజిల్స్‌లోని నైట్ రైడర్స్ స్టేడియం, 2034 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లకు కూడా వేదిక కానుంది. KKR సహ-యజమాని షారుఖ్ ఖాన్ నేతృత్వంలోని నైట్ రైడర్స్ గ్రూప్ ఈ స్టేడియాన్ని నిర్మించింది.

* వచ్చే ఏడాది IND vs WI సిరీస్: 2024 వరల్డ్ కప్‌కు న్యూయార్క్ (తాత్కాలిక స్టేడియం– ప్రస్తుతం తొలగించారు), టెక్సాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియం, ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ వేదికలయ్యాయి. అలాగే వచ్చే ఏడాది భారత్‌తో జరిగే సిరీస్‌లోని రెండు టీ20 మ్యాచ్‌లను వెస్టిండీస్ జట్టు అమెరికాలోని వాషింగ్టన్ లేదా ఫ్లోరిడాలో నిర్వహించే ఛాన్స్ ఉంది.