కర్ణాటకలో నందిని పెరుగు ధరలను తగ్గిస్తూ కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) నిర్ణయం తీసుకుంది. కిలో పెరుగుపై రూ.2 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన ధరలు నవంబర్ 29 నుంచి అమలులోకి వస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది కేఎంఎఫ్.
తాజా నిర్ణయంతో ప్రస్తుతం రూ.68 ఉన్న కిలో నందిని పెరుగు ప్యాకెట్ ధర రూ.66కు తగ్గనుంది. అలాగే రూ.34 ఉన్న 500 గ్రాముల ప్యాకెట్ ధర రూ.33కు చేరనుంది. కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని పెరుగు ధరలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేఎంఎఫ్ పేర్కొంది.
విమర్శలు వెల్లువెత్తడంతో నిర్ణయం
నవంబర్ 1న నందిని పాలు, పెరుగు ధరలను ప్రభుత్వం పెంచింది. అప్పట్లో లీటర్ పాలుపై రూ.8 పెంచడంతో పాటు పెరుగు ధరలను కూడా సవరించింది. నవంబర్ 1కి ముందు కిలో పెరుగు ధర రూ.54, అర కిలో పెరుగు ధర రూ.28 ఉండేది. ధరల పెరుగుదలపై వినియోగదారులు, హోటల్ అసోసియేషన్లు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని పెరుగు ధరను తగ్గించాలని సూచించింది.
పాల ఉత్పత్తిదారుల విజ్ఞప్తి మేరకు నవంబర్ ప్రారంభంలో ధరలు పెంచినట్లు కేఎంఎఫ్ తెలిపింది. అయితే ప్రజల నుంచి అభ్యంతరాలు రావడంతో పెరుగు ధరను మాత్రం రూ.2 తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించింది.
సహకార సూత్రాల ప్రకారం వినియోగదారులు, పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాల మధ్య సమతుల్యత పాటిస్తున్నట్లు ఫెడరేషన్ వివరించింది. లక్షలాది మంది పాడి రైతుల ఆర్థిక సాధికారతకు కేఎంఎఫ్ అండగా ఉంటుందని ప్రకటనలో పేర్కొంది.
