తాజ్ మహల్ ప్రాంగణంలో కోతుల గుంపులు తిరుగుతుండటం పర్యాటకులలో ఆందోళన కలిగిస్తోంది. వీటి వల్ల పర్యాటకులు, ముఖ్యంగా విదేశీ సందర్శకులపై కోతులు దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజ్ మహల్ లోని తూర్పు, పడమర, రాయల్ గేట్ల దగ్గర కోతుల సంఖ్య అధికంగా ఉందని... ఇక్కడ కోతుల గుంపులు తిరుగుతూ పర్యాటకులపై దాడులకు దిగుతున్నాయని అంటున్నారు. గతంలోనూ పలువురు భారతీయ, విదేశీ సందర్శకులు కోతుల దాడిలో గాయపడ్డారని అంటున్నారు.
సెప్టెంబర్ నెలలో జరిగిన దాడిలో ఇద్దరు పర్యాటకులు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని... ఇందులో బ్రెజిల్ దేశానికి చెందిన 83 ఏళ్ల పర్యాటకుడు ఒకరు కాగా, మరొకరు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారని తెలుస్తోంది. ప్రాంగణంలోని నీటి ఫౌంటైన్లలో కోతులు స్నానం చేయడం, ఒకదానిని ఒకటి తరుముకోవడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కోతులను పట్టుకోవడానికి, అక్కడి నుంచి తరిమేయడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజ్ మహల్ ను నిర్వహిస్తున్న వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం కావడం లేదని అంటున్నారు. ఈ క్రమంలో తాజ్ మహల్ దగ్గర పర్యాటకుల భద్రత విషయంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
