లంబాడాల అభ్యున్నతికి ప్రత్యేక కమిషన్.. ఆ సామాజిక వర్గం వ్యక్తే చైర్మన్: సీఎం రేవంత్

లంబాడాల అభ్యున్నతికి ప్రత్యేక కమిషన్.. ఆ సామాజిక వర్గం వ్యక్తే చైర్మన్: సీఎం రేవంత్

హైదరాబాద్: లంబాడా సోదరుల విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు సామాజిక, రాజకీయ అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తామని, ఆ కమిషన్ చైర్మన్‌గా లంబాడా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమిస్తామని ప్రకటించారు. గురువారం (నవంబర్ 26) నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మద్దిమడుగులో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు.

ఈ సందర్భంగా సంత్ సేవాలాల్ మహారాజ్ సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. మద్దిమడుగులో జన్మించిన సేవాలాల్ మహారాజ్ సమాజానికి సన్మార్గాన్ని చూపించారని, మద్యం, మాంసానికి దూరంగా ఉంటూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని బోధించారని పేర్కొన్నారు. లంబాడా సోదరులందరికీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆరాధ్య దైవమని అన్నారు.

ఇందిరాగాంధీ హయాంలో లంబాడాలకు గుర్తింపు

లంబాడా సామాజిక వర్గాన్ని కొన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా చూశాయని సీఎం విమర్శించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మాత్రమే లంబాడాల పోరాట పటిమను గుర్తించి సమాన అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకులను, నిజాం నవాబును ఎదిరించిన చరిత్ర లంబాడా జాతికి ఉందన్నారు. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న వారికి తండాల్లో ఆశ్రయం కల్పించిన ఘనత లంబాడా సోదరులదని చెప్పారు.

లంబాడాల ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దృష్టికి జైపాల్ రెడ్డి తీసుకెళ్లారని, 1976లో వారిని షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చినట్లు సీఎం గుర్తుచేశారు. రిజర్వేషన్ల వల్ల లంబాడా యువత ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత ఉద్యోగాలు సాధించడంతో పాటు రాజకీయాల్లోనూ వివిధ పదవులు చేపట్టారని తెలిపారు.

దున్నేవాడికే భూమి ఇవ్వాలనే లక్ష్యంతో ఇందిరాగాంధీ హయాంలో లంబాడా సోదరులకు 12 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి లంబాడా ఇంట్లో సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటం పక్కన ఇందిరాగాంధీ చిత్రపటం కనిపిస్తుందని అన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పథకాలతో గిరిజనులకు లబ్ధి

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పెద్దఎత్తున ప్రయోజనం చేకూరుతోందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో మంజూరు చేసిన 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో సుమారు 4 లక్షల ఇళ్లు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందాయని వెల్లడించారు. దీంతో పేద కుటుంబాలు సొంత ఇళ్లను నిర్మించుకుని ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కలుగుతోందన్నారు.

రాష్ట్రంలో 3.40 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని, ఈ పథకం ద్వారా లంబాడా సహా గిరిజన కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో గిరిజన, ఆదివాసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

అచ్చంపేట అభివృద్ధికి రూ.450 కోట్లు

అచ్చంపేట, నల్లమల ప్రాంతం తన జన్మస్థలమని, ఈ ప్రాంత బిడ్డగా చెప్పుకోవడం తనకు గర్వకారణమని రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని నిలబడాలనే తత్వం ఈ ప్రాంతం నుంచే నేర్చుకున్నానని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచార సమయంలో వంశీకృష్ణను గెలిపిస్తే అచ్చంపేటకు ఒక ఎమ్మెల్యే కాదు.. ఇద్దరు ఎమ్మెల్యేల అండ ఉంటుందని హామీ ఇచ్చానని గుర్తుచేశారు. ఆ హామీ మేరకు అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి రూ.450 కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయం

మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయాన్ని దేశానికే తలమానికంగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఆలయానికి ఉన్న 16 ఎకరాలకు అదనంగా మరో నాలుగు ఎకరాల భూమిని సేకరించి మొత్తం 20 ఎకరాల్లో ఆలయ నిర్మాణం చేపడతామని తెలిపారు.

లంబాడా సోదరుల ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు దానికి లంబాడా సోదరుడిని చైర్మన్‌గా నియమిస్తామని ప్రకటించారు. రాజకీయాల్లో లంబాడాలకు రావాల్సిన ప్రాతినిధ్యం కోసం ఢిల్లీ వరకు వెళ్లి పోరాడతామని, వారి అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.