జియో ఆస్ట్రో పేరుతో అంబానీ జ్యోతిష్యం

జియో ఆస్ట్రో పేరుతో అంబానీ జ్యోతిష్యం

ముంబై: బిలియనీర్ ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ డిజిటల్ జ్యోతిష్య రంగంలోకి అడుగుపెట్టింది. జియోఆస్ట్రో పేరుతో ఏఐ ఆధారిత వేద జ్యోతిష్య ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది కుండలి రీడింగ్స్, జాతక విశ్లేషణ వంటి సేవలను అందిస్తుంది. స్విస్ ఎఫెమెరిస్ గణాంకాల ద్వారా పుట్టిన తేదీ, సమయం, ప్రాంతం ఆధారంగా ఈ యాప్ జాతక చక్రాలను రూపొందిస్తుంది. ఉత్తర భారత, దక్షిణ భారత పద్ధతుల్లో డి1 (లగ్న), డి9 (నవాంశ) చక్రాలను చూసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ యాప్‌లోని ఏఐ ఫీచర్ 40 కంటే ఎక్కువ యోగాలను గుర్తిస్తుంది. మంగళ, కాలసర్ప, పితృ, గ్రహణ దోషాలను విశ్లేషిస్తుంది.

యాప్ ఫీచర్లు ఇవే

రోజువారీ, వార్షిక జాతకాలు, ముహూర్తాలు, తిథి, నక్షత్రాలతో కూడిన పంచాంగాన్ని ఈ యాప్ అందిస్తుంది. కెరీర్, బంధాలు, సంపద, ఆరోగ్యం, ఆధ్యాత్మిక విషయాలపై లైఫ్ స్నాప్‌షాట్ ఫీచర్ ద్వారా వివరాలు ఇస్తుంది. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ భాషల్లో ఈ సేవలు ఉన్నాయి. ఒకే ఖాతాలో నలుగురు కుటుంబ సభ్యుల ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. జాతక రిపోర్టులను పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది.

అంతర్గత టెస్టింగ్

ప్రస్తుతానికి జియోఆస్ట్రో ఆహ్వానం ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంది. కంపెనీ తన అంతర్గత టెస్టింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా దీనిని ప్రోటోటైప్ దశలో నడుపుతోంది. యాప్ ధర, ప్రజలందరికీ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది అనే వివరాలను ఇంకా వెల్లడించలేదు. మార్కెట్‌లో ఆస్ట్రోటాక్, ఆస్ట్రోసేజ్ వంటి సంస్థలకు జియోఆస్ట్రో పోటీగా మారనుంది. ఆస్ట్రోటాక్ సంస్థ 2026లో 1 బిలియన్ డాలర్ల విలువతో యూనికార్న్ క్లబ్‌లో చేరింది. ఆ సంస్థ వార్షిక ఆదాయం రూ.2,500 కోట్లుగా ఉందని కంపెనీ పేర్కొంది. ఆస్ట్రోటాక్ మానవ జ్యోతిష్యులతో కన్సల్టేషన్ ఇస్తే, జియో మాత్రం ఏఐ ద్వారా ఆటోమేటెడ్ రీడింగ్స్ ఇస్తోంది.

మార్కెట్ విలువ

మార్కెట్ రీసెర్చ్ సంస్థ మార్క్ఎన్‌టెల్ అడ్వైజర్స్ ప్రకారం.. భారత డిజిటల్ జ్యోతిష్య మార్కెట్ విలువ 2026లో 390 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇది ఏటా 34.61 శాతం వృద్ధితో 2032 నాటికి 2.32 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. సెన్సార్ టవర్ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య జ్యోతిష్య యాప్స్‌ను 150 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 75 శాతం ఎక్కువ. 25 నుంచి 35 ఏళ్ల వయసు వారు ఈ యాప్స్‌ను ఎక్కువగా వాడుతున్నారని ఎకనామిక్ టైమ్స్ నివేదిక తెలిపింది.