India A vs Sri Lanka A: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ (Asia Cup Rising Stars) 2026 తొలి సెమీఫైనల్లో భారత్- A (India A) బ్యాటర్లు జూలు విదిల్చారు. దోహా వేదికగా ఈరోజు ( గురువారం, నవంబర్ 26) శ్రీలంక-A (Sri Lanka A) తో జరుగుతున్న కీలక నాకౌట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్న భారత్-A నిర్ణీత ఓవర్లలో 317/8 భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (78), ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ (54)*, కెప్టెన్ తిలక్ వర్మ (53) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో శ్రీలంక-A ముందు 318 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది.
వైభవ్‌తో అభిషేక్ కలిసి 8 ఓవర్లలోనే 80 రన్స్:
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్-Aకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ (27 బంతుల్లో 40) కలిసి తొలి వికెట్‌కు కేవలం 8 ఓవర్లలోనే 80 పరుగులు జోడించి శ్రీలంక బౌలర్లపై ఆరంభం నుంచే ఒత్తిడి పెంచారు. ఇక వైభవ్ ఔటైన తర్వాత కూడా అభిషేక్ శర్మ 63 బంతుల్లో 78 పరుగులు చేసి జట్టుకు పటిష్టమైన పునాది వేశాడు.
మిడిలార్డర్‌లో తిలక్ నిలకడ.. చివర్లో షాబాజ్ ఫినిషింగ్:
మిడిల్ ఓవర్లలో వికెట్లు పడుతున్న దశలో కెప్టెన్, ఆల్‌రౌండర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లు ఆడారు. కీలక సమయంలో క్రీజులో నిలదొక్కుకున్న కెప్టెన్ తిలక్ వర్మ 53 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇక చివరి ఓవర్లలో షాబాజ్ అహ్మద్ (54 నాటౌట్) అజేయ అర్ధశతకంతో మెరవడంతో భారత్-A స్కోరు 300 మార్కు దాటి 317/8కు చేరుకుంది.
శ్రీలంక బౌలర్ల దూకుడు:
భారత్ A బ్యాటర్లని ఒకానొక సమయంలో శ్రీలంక A బౌలర్లు తక్కువ పరుగులకే కట్టిడి చేసేలా కనిపించారు. ఈ క్రమంలో నిపున్ ధనంజయ, జనిత్ లియనాగే, రవిందు ఫెర్నాండో తలో రెండు వికెట్లు పడగొట్టగా, గరుక సంకేత్, లహిరు సమరకోన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
