తమిళనాడులోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న 'దీపతూన్' స్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పక్కనపెట్టి.. దీపం వెలిగించకుండా అడ్డుకోవడంపై కోర్టు ధిక్కరణ పిటిషన్లను జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వ తీరుపై, స్థానిక పోలీసుల వ్యవహారశైలిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
అధికారులను అడ్డుకున్న తమిళనాడు పోలీసులు:
నవంబర్ 24న దీపతూన్ వద్ద ఒక్కసారి కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు నవంబర్ 20న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి వెళ్లిన భారత పురావస్తు శాఖ అధికారులను తమిళనాడు పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆలయ ట్రస్టీలు చెప్పడంతో పాటు, పోలీసులు దీపం వద్దకు తమను వెళ్లనివ్వలేదని పురావస్తు శాఖ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే:
ప్రభుత్వం మొదటి నుంచి దీపం వెలిగించడాన్ని వ్యతిరేకిస్తూనే ఉందని తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. ప్రాంగణమంతా పోలీసులతో నిండిపోయిన దృశ్యాలు వీడియోలలో స్పష్టంగా ఉన్నాయని.. ఇది అధికారుల అహంకారానికి, తీవ్రమైన కోర్టు ధిక్కరణకు నిదర్శనమని ఆయన వాదించారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారుల వాదనలు వినే ముందు, వారు తమ తప్పును సరిదిద్దుకునేలా దీపతూన్ వద్ద దీపం వెలిగించేలా ఆదేశించాలని, ఈ ప్రక్రియను మరో స్వతంత్ర సంస్థ పర్యవేక్షించేలా చూడాలని కోర్టును కోరారు.
ప్రభుత్వం క్షమాపణలు.. ఆలయ అధికారులపై నెపం:
పిటిషనర్ కార్తికేయన్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్. గురు కృష్ణ కుమార్ వాదిస్తూ.. అసలు దీపం వెలిగించకూడదని తమిళనాడు ప్రభుత్వం ముందే నిర్ణయించుకుందని ఆరోపించారు. కలెక్టర్ సైతం పురావస్తు శాఖతో సంప్రదింపులు జరపలేదని, ప్రభుత్వం సమర్పించిన ప్రాథమిక నివేదిక వారి తప్పును అంగీకరించినట్లుగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు దీపం వెలిగించకపోవడంపై తమిళనాడు ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పింది. ఈ వైఫల్యానికి అరుల్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయ అధికారులే కారణమని ప్రభుత్వం నెపం నెట్టే ప్రయత్నం చేసింది.
వివాదం నేపథ్యం ఇదే:
సుప్రీంకోర్టు అనుమతి ఉన్నప్పటికీ.. నవంబర్ 24న తిరుపరంకుండ్రం కొండపై సాంప్రదాయకంగా వెలిగించే ఉచ్చిపిళ్లయార్ మండపంలో మాత్రమే కార్తీక దీపాన్ని వెలిగించారు. దీపతూన్ స్తంభం వద్ద దీపం వెలిగించకపోవడంతో వివాదం ముదిరింది. ఈ అంశంలో ప్రధాన వివాదం జోలికి వెళ్లకుండా.. కేవలం తమ నవంబర్ 20 నాటి ఆదేశాలను అమలు చేయకపోవడంపైనే విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.
ALSO READ : ఇది కోర్టు ధిక్కారమే.. విజయ్ సర్కార్‌పై సుప్రీం కోర్టు సీరియస్
తాజాగా ధర్మాసనం ఆలయ బోర్డును రద్దు చేయటంతో పాటు ఆ ప్రాంగణంలో శాంతియుతంగా కార్తీకదీపం వెలిగించేలా సీఆర్పీఎఫ్కి రక్షణ బాధ్యతలు అప్పగించింది. ఈ శనివారం రోజున దీపతూన్ స్తంభం వద్ద దీపం వెలిగించాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టిన విజయ్ సర్కార్ అధికారులకు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని సంచలన తీర్పు వెలువరించింది.
