TMC రెబల్ వర్గానికి కోల్‎కతా హైకోర్టులో భారీ ఎదురు దెబ్బ

TMC రెబల్ వర్గానికి కోల్‎కతా హైకోర్టులో భారీ ఎదురు దెబ్బ

కోల్‎కతా: రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తృణమాల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్ వర్గానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా రీతబ్రత బెనర్జీ నియామకాన్ని కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. జస్టిస్ కృష్ణారావు నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 27) కీలక తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యే అఖ్రుజ్జమాన్‌ను చీఫ్ విప్‌గా నియమిస్తూ స్పీకర్ ఇచ్చిన ఆదేశాలను కూడా హైకోర్టు కొట్టివేసింది. మమతా బెనర్జీ వర్గం చేసిన వాదనలను మళ్లీ పరిశీలించాలని స్పీకర్ రతీంద్ర బోస్‌ను కోర్టు ఆదేశించింది. ప్రతిపక్ష నేత ఎంపికపై 10 రోజుల్లోగా కొత్త ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుతో రిటాబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేత హోదాను కోల్పోనున్నారు. మమతా బెనర్జీ వర్గానికి హైకోర్టు తీర్పు భారీ ఊరట కలిగించింది.

వివాదం ఏంటంటే..?

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమాల్ కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే రీతబ్రత బెనర్జీ నాయకత్వంలో ఒక వర్గం పార్టీ నుంచి విడిపోయింది. డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్ పేరుతో కొత్త వర్గంగా ఏర్పడ్డారు. టీఎంసీ తమ శాసనసభా పక్ష నేతగా సోభందేబ్ చటోపాధ్యాయను నియమించింది. 58 మంది రెబల్ ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీని టీఎంసీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోగా.. అసెంబ్లీ స్పీకర్ అంగీకరించారు. 

పశ్చిమ బెంగాల్ గవర్నర్ కూడా ఆయన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించారు. ఈ క్రమంలో స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సోభందేబ్ చటోపాధ్యాయ కల్‎కతా హైకోర్టును ఆశ్రయించారు. తృణమూల్ కాంగ్రెస్ మాతృ సంస్థ తరపున తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టిన హైకోర్టు.. స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా రీతబ్రత బెనర్జీ నియామకాన్ని రద్దు చేసింది. ప్రతిపక్ష నేత ఎంపికపై 10 రోజుల్లోగా కొత్త ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది.