- బెంగళూరు తరహాట్రాఫిక్ కష్టాలు మనకు రావొద్దు
- త్వరలో కార్పూలింగ్కుప్రత్యేక పాలసీ తెస్తాం
- టీ హబ్‌లో ‘సైబరాబాద్ మూవ్స్-2026’ ను ప్రారంభించిన డీజీపీ
గచ్చిబౌలి, వెలుగు: సొంత కారులో ఆఫీసులకు రావడం స్టేటస్ సింబల్‌గా మారిందని, ఈ ఆలోచనా విధానం మారాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఉద్యోగులంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, కార్‌పూలింగ్‌ను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. సైబరాబాద్‌లో పట్టణ రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూపొందించిన ‘సైబరాబాద్ మూవ్స్-2026’ కార్యక్రమాన్ని గురువారం టీ-హబ్‌లో ఆయన ప్రారంభించారు.
డీజీపీ మాట్లాడుతూ..కోర్ ఐటీ ప్రాంతంలో కేవలం 2 చదరపు కి.మీ.పరిధిలోనే 9 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. ఒక్కొక్కరు ఒక్కో కారు, బైక్‌పై రావడం వల్ల ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతోందని, చెప్పారు. బెంగళూరు తరహా ట్రాఫిక్ కష్టాలు హైదరాబాద్‌కు రాకుండా ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలన్నారు.
కార్‌పూలింగ్‌కు త్వరలో ప్రత్యేక పాలసీ
ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని, ఇందుకు కార్పొరేట్ సంస్థలు, ఉద్యోగులు సహకరించాలని డీజీపీ కోరారు. కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక పాలసీని ప్రకటించనుందని వెల్లడించారు. కార్యక్రమంలో సైబరాబాద్ కమిషనర్ రమేశ్, మున్సిపల్ కమిషనర్ సృజన, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. లండన్, బొగోటా రవాణా నిపుణులు తమ అంతర్జాతీయ అనుభవాలను పంచుకోగా, కార్పొరేట్ సంస్థలు ‘సస్టైనబిలిటీ ప్రతిజ్ఞ’ చేశాయి.
పోలీసుల వృత్తి నైపుణ్యాలకు డ్యూటీ మీట్ వేదిక
పోలీసు డ్యూటీ మీట్లు, క్రీడలు, బ్రాస్ బ్యాండ్ వంటి కార్యక్రమాలు సిబ్బందిలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమష్టి భావనను పెంపొందిస్తాయని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. పోలీసుల వృత్తి నైపుణ్యాలకు డ్యూటీమీట్లు వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. పోలీసు అకాడమీలో 4 రోజుల పాటు నిర్వహించిన మూడో తెలంగాణ పోలీసు డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీజీపీ సీవీ ఆనంద్ విజేతలకు పతకాలు ప్రదానం చేశారు.
