- రూ.2 వేల జరిమానా.. చెల్లించకపోతే మరో వారం జైలు
- జీడిమెట్లలో 6.15 ఎకరాల భూ వివాదంలో హైకోర్టు చర్యలు
- ఆదేశాలు తెలిసి ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారు: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేశ్, డీసీపీ ఎన్. కోటిరెడ్డికి రెండు వారాల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు గురువారం తీర్పు చెప్పింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా వారం రోజులు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును వారం రోజులు నిలిపివేసింది. ఈలోగా స్టే ఉత్తర్వులు పొందకపోతే రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని స్పష్టం చేసింది.
జీడిమెట్ల భూ వివాదంలో..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలోని 6.15 ఎకరాల భూమికి రక్షణ కల్పించాలన్న హైకోర్టు ఆదేశాలను పోలీసులు అమలు చేయలేదంటూ ఎ. ప్రవీణ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ భూమికి సంబంధించి సివిల్ కోర్టు ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. భూ వివాదం పరిష్కారమయ్యే వరకు భూమికి రక్షణ కల్పించాలని హైకోర్టు గతంలో పోలీసులను ఆదేశించింది. అయినా ఆ ఉత్తర్వులు అమలు చేయలేదని పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు.
సివిల్ వివాదం పెండింగ్‌లో ఉందనే కారణంతో హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని, కానీ కోర్టు ఉత్తర్వులను విస్మరించడానికి వీల్లేదని పేర్కొన్నారు. దర్యాప్తు పేరుతో సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడం, న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించడం అనుమతించబోమని తేల్చిచెప్పారు. ఆదేశాలపై స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన తర్వాత క్షమాపణ చెబితే సరిపోదని వ్యాఖ్యానించారు. ఇదే కేసులో హోంశాఖ ముఖ్య కార్యదర్శిపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కొట్టివేశారు.
