- నాగర్ కర్నూల్, సంగారెడ్డి, జనగామ, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షం
- నాగర్ కర్నూల్ జిల్లా యంగంపల్లి, కల్వకుర్తిలో 4.5 సెంటీమీటర్ల వాన
- సంగారెడ్డి జిల్లాలో 11 చోట్ల వాన.. వట్‌పల్లిలో 4 సెంటీమీటర్లు
- హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోనూ చిరుజల్లులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తుఫాన్ల సమయంలో వర్షాలు పడతాయని భావించినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఇప్పుడు ఎలాంటి వాతావరణ వ్యవస్థలు లేకుండానే పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పంటలు చేతికొచ్చే సమయంలో వానలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో ఈ వర్షాలతో కొంతైనా వర్షపాత లోటు భర్తీ అవుతుందని ఆశిస్తున్నారు. గురువారం రాత్రి నుంచి నాగర్ కర్నూల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగామ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఉత్తర, దక్షిణ జిల్లాల్లోనూ చిరుజల్లులు కురిశాయి.
నాగర్ కర్నూల్, సంగారెడ్డిలో అధికం..
రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నాగర్ కర్నూల్ జిల్లాలో నమోదైంది. తాడూరు మండలం యంగంపల్లిలో 4.5 సెంటీమీటర్లు, కల్వకుర్తి మండలం తోటపల్లిలో 4.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఊర్కొండలో 1.2, నాగర్ కర్నూల్‌లో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో 11 కేంద్రాల్లో వర్షం పడగా.. వట్‌పల్లిలో 4 సెంటీమీటర్లు, చౌటకూర్‌లో 2 సెంటీమీటర్ల వాన కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా షారాజీపేటలోనూ 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. హైదరాబాద్ జిల్లా షేక్‌పేట మండలం ఫిల్మ్‌నగర్ (గౌతమ్ నగర్ ఫంక్షన్ హాల్) వద్ద 0.28 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
