Pankaj Advani: ఇండియా స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ.. ప్రతిష్టాత్మక క్రూసిబుల్ కప్‌ను గెలుచుకున్నాడు. దాంతో ఈ కప్ గెలిచిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. బ్రిటన్‌లోని రీడింగ్‌లో వేగవంతమైన స్నూకర్ 900 ఫార్మాట్‌లో జరిగిన ఫైనల్లో పంకజ్ 6–0తో టోనీ డ్రాగో (మాల్టా)పై నెగ్గాడు. తొలి మ్యాచ్‌లో 5–2తో డిఫెండింగ్ చాంపియన్ నీల్ రాబర్ట్‌సన్ (ఆస్ట్రేలియా)పై గెలిచిన పంకజ్.. తర్వాతి మ్యాచ్‌లో 5–1తో జో పెర్రీని ఓడించి ఫైనల్‌కు చేరాడు.
టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడిన పంకజ్ కేవలం మూడు ఫ్రేమ్‌లు మాత్రమే కోల్పోయాడు. స్నూకర్ 900 ఫార్మాట్‌లో ఆటగాళ్లు ప్రతి షాట్‌ను 20 సెకన్లలోపు ఆడాల్సి ఉంటుంది. ప్రతి ఫ్రేమ్‌కు 15 నిమిషాల టైమ్ ఉంటుంది. బంతులన్నీ క్లియర్ కాకపోయినా, టైమ్ పూర్తయ్యే వరకు ఎవరు ఆధిక్యంలో ఉంటారో వారినే విజేతగా ప్రకటిస్తారు.
