హైదరాబాద్, వెలుగు: వివిధ సైన్స్ డిపార్ట్మెంట్లు పరస్పరం కలిసి పనిచేయడం ద్వారానే విప్లవాత్మక ఆలోచనలు, తదుపరి తరం టెక్నాలజీలు సాధ్యమవుతాయని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్(డీఎస్టీ) సెక్రటరీ ప్రొఫెసర్ ఉమేష్ వాఘ్మారే అన్నారు. సీఎస్ఐఆర్–-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) 39వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. కంప్యూటేషనల్ మెటీరియల్ సైంటిస్ట్ గా తాను, తన రీసెర్చ్ టీమ్ ఏఐ, ఎంఎల్ సాయంతో సూపర్ కండక్టర్లకు సంబంధించిన అనేక సంభావ్య పదార్థాలను అంచనా వేయగలిగామని తెలిపారు.
మెదడు పనితీరును అర్థం చేసుకునేందుకు అభివృద్ధి చేసిన టూల్స్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్ వర్క్స్ వంటి కంప్యూటింగ్ టూల్స్ రూపకల్పనకు దోహదపడ్డాయన్నారు. ఇప్పుడు డీఎన్ఏను సైతం డేటా కంప్యూటింగ్, స్టోరేజ్ కోసం ఉపయోగిస్తున్నారని, ప్రస్తుతం ఏటా ఉత్పత్తి అవుతున్న 1 బిలియన్ టీబీ డేటాను నిల్వ చేసే విధానాన్ని డీఎన్ఏ మార్చగలదని పేర్కొన్నారు. సీఎస్ఐఆర్–-సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కె.నందికూరి మాట్లాడుతూ ప్రాథమిక పరిశోధనల నుంచి ఆరోగ్యం, వ్యవసాయం, ప్రకృతి సంరక్షణ వరకు సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపే ప్రాజెక్టులతో సీసీఎంబీ విస్తృతంగా పనిచేస్తోందన్నారు. జీవశాస్త్ర పరిశోధనలు కనీవినీ ఎరుగని మార్పులకు లోనవుతున్నాయని, ఈ మార్పుల్లో ముందుండేందుకు సీసీఎంబీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
