ప్రాథమిక దశలోనే పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం
న్యూఢిల్లీ, వెలుగు: బదిలీ నిబంధనలకు అంగీకరించి, సీనియారిటీని వదులుకుంటామని రాతపూర్వక హామీ (అండర్ టేకింగ్) ఇచ్చాక.. ఇప్పుడు అభ్యంతరం చెప్పడం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతర్రాష్ట్ర బదిలీల ద్వారా తెలంగాణకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల సీనియారిటీ వివాదంపై సుప్రీం వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో ఎం.సునీత, బి.మధు బిందు, ఎర్ర సవిత, ఎం. భాగ్యశ్రీలు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను(ఎస్ఎల్పీ) ధర్మాసనం కొట్టివేసింది.
ఇంజినీర్-ఇన్-చీఫ్ (అడ్మినిస్ట్రేషన్ వింగ్) పరిధిలో పనిచేస్తోన్న తమ సీనియారిటీని 2018 జాబితా కంటే దిగువన ఖరారు చేయడాన్ని పిటిషనర్లు సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ ఎస్ఎల్పీలు దాఖలు చేశారు. ఇందులో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో పాటు 2 రాష్ట్రాల ఇంజినీర్–ఇన్–చీఫ్‌లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్లను గురువారం జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం.పంచోలిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. 2017 ఆగస్టు 7న జారీ అయిన ఉమ్మడి గైడ్ లైన్స్ ల ప్రకారం.. 2 నెలల్లోగా బదిలీ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉందని పిటిషనర్ల తరఫు అడ్వకేట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం జాప్యం చేసి 2018 జూలై 5న ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు.
ఇంత జాప్యం ఉంటుందని స్పష్టత ఉంటే.. పిటిషనర్లు బదిలీని ఎంచుకునేవారే కాదని నివేదించారు. ఈ వాదనలపై బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. ఉత్తర్వుల జారీలో జాప్యం జరిగినప్పుడు బదిలీకి ఎందుకు సుముఖత వ్యక్తం చేశారని ప్రశ్నించింది. ‘నిబంధనల ప్రకారం చివరి ర్యాంకుకు అంగీకరిస్తూ హామీ పత్రం ఇచ్చారు కదా? ఆలస్యమైందని అభ్యంతరం ఉంటే అప్పుడే తిరస్కరించాలి. విధుల్లో చేరాక ఇప్పుడు సీనియారిటీపై అభ్యంతరం చెప్పడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని స్పష్టం చేసింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటూ.. ఎస్ఎల్పీలను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.
