మసీదులో నమాజు చేయకుండా ఏ ముస్లింనూ అడ్డుకోలేరని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైనా మసీదులోకి వెళ్లి ప్రార్థనలు చేసుకోవచ్చని జస్టిస్ వి లక్ష్మీనారాయణ గురువారం ( నవంబర్ 26 ) తీర్పు ఇచ్చారు. ఎవరు నిజమైన ముస్లిం అనేది దేవుడు నిర్ణయిస్తాడని, సాధారణ మనుషులు కాదని ఆయన వ్యాఖ్యానించారు.
బీజేపీ మైనారిటీ మోర్చా నాయకుడు సయ్యద్ ఇబ్రహీం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. సేలంలోని ఒక మసీదులో తనను నమాజు చేయకుండా ఐయూఎంఎల్ కార్యకర్త సయ్యద్ మూసా అడ్డుకుంటున్నారని ఇబ్రహీం ఆరోపించారు. దీనిపై స్పందించిన జడ్జి, మసీదులోకి ప్రవేశించే ముందు రాజకీయాలను, ఇతర విభేదాలను బయట వదిలి రావాలని సూచించారు.
మసీదు అల్లాకు అంకితం
మసీదులు అల్లాకు అంకితం చేసినవని, వాటికి మనుషులు కేవలం నిర్వాహకులు మాత్రమేనని పేర్కొంది కోర్టు. ఎవరో ఒకరు విరాళం ఇచ్చినంత మాత్రాన అది వారి సొంతం కాదని... అల్లా నిర్ణయం ప్రకారం పిటిషనర్ ముస్లిం అయితే, దానికి భిన్నంగా నిర్ణయించే అధికారం మనుషులకు లేదని స్పష్టం చేసింది కోర్టు.
మసీదు లోపల నమాజు చేయించే ఇమామ్ మాత్రమే ముందు వరుసలో ఉంటారని... మిగిలిన వారు వారి సామాజిక, ఆర్థిక హోదాలతో సంబంధం లేకుండా ఒకరినొకరు తాకుతూ కలిసి ప్రార్థనలు చేస్తారని తెలిపింది కోర్టు. అటువంటి ప్రార్థనా స్థలాల్లో రాజకీయాలకు చోటు ఉండకూడదని పేర్కొంది కోర్టు.
