అచ్చంపేట అభివృద్ధికి నా రక్తాన్ని చెమటగా మారుస్తా: సీఎం రేవంత్

అచ్చంపేట అభివృద్ధికి నా రక్తాన్ని చెమటగా మారుస్తా: సీఎం రేవంత్

హైదరాబాద్: అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అచ్చంపేటను దత్తత తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ కోరుతున్నారని, అయితే తాను ఇదే గడ్డపై పుట్టిన బిడ్డనని, ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. తన రక్తాన్ని చెమటగా మార్చి అచ్చంపేట ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గురువారం (నవంబర్ 26) నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.

అచ్చంపేటకు ఘనమైన చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం

అచ్చంపేటకు ఎంతో గొప్ప చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం ఉందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా పేరొందిన ఉమామహేశ్వరం, మద్దిమడుగు ఆంజనేయ స్వామి క్షేత్రం, తెలంగాణ అమరనాథ్‌గా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయని చెప్పారు.

శాతవాహనులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కందూరు చోళులు, కాకతీయులు, రేచర్ల నాయకులు, బహమనీ, కుతుబ్‌షాహీ సుల్తానులు, నిజాంల పాలనకు ఈ ప్రాంతం చారిత్రక సాక్ష్యంగా నిలిచిందన్నారు. చెంచు గిరిజనుల జీవన విధానానికి ఆలవాలమైన నల్లమల అటవీ ప్రాంతం అచ్చంపేటకు ప్రత్యేకత అని పేర్కొన్నారు.

14వ శతాబ్దంలో అల్లావుద్దీన్‌ ఖిల్జీ సేనాధిపతి మాలిక్‌ కాఫర్‌ను ఎదురించి పోరాడిన వీరవనిత అచ్చమాంబ చరిత్రను ఈ సందర్భంగా గుర్తుచేశారు. దక్షిణ భారతదేశ ఝాన్సీ లక్ష్మీబాయిగా పేరొందిన అచ్చమాంబ స్ఫూర్తితోనే మహిళా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

ఇందిరమ్మ స్ఫూర్తితో సంక్షేమ కార్యక్రమాలు

ఇందిరాగాంధీ స్ఫూర్తితో తమ ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని సీఎం అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా వంటి పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. గత ఏడాది మహిళలకు పాలపిట్ట రంగు చీరలు అందించామని, ఈసారి అచ్చంపేట వేదికగా చిలకపచ్చ రంగు చీరలను అందిస్తున్నామని తెలిపారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. పేదలను గుండెల్లో పెట్టుకుని చూసుకోవడమే తమ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు.

కేసీఆర్‌పై సీఎం విమర్శలు

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్‌ ప్రజల్లోకి రావడం లేదని, ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని ఆరోపించారు. ప్రజల సమస్యలను పట్టించుకోని ఆయనను ఎలా శిక్షించాలో ప్రజలే నిర్ణయించాలని అన్నారు.

తెలంగాణను ధనిక రాష్ట్రంగా అప్పగిస్తే అప్పుల రాష్ట్రంగా మార్చారని, రూ.8.11 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం మూడేళ్లలో రైతుల కోసం రూ.1.78 లక్షల కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు.

పాలమూరు ప్రాజెక్టులపై ప్రశ్నలు

పాలమూరు ప్రాంత సాగునీటి ప్రాజెక్టులను గత పదేళ్ల పాలనలో కేసీఆర్‌ నిర్లక్ష్యం చేశారని సీఎం ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టుల కోసం రూ.10 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.

అచ్చంపేట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని అన్నారు. పాలమూరు, అచ్చంపేట, డిండి ప్రాజెక్టులు పూర్తయి ఉంటే ఈ ప్రాంతానికి సాగునీటి సమస్య ఉండేది కాదని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్‌, హంద్రీనీవా, ముచ్చుమర్రి ప్రాజెక్టుల ద్వారా నీటిని తరలించుకుపోతుంటే గత ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరిగేలా వ్యవహరించారని కేసీఆర్‌పై ఆరోపణలు చేశారు. పాలమూరు ప్రాంతాన్ని కృష్ణా జలాలతో తడపాల్సిన బాధ్యత తనపై ఉందని, ఈ ప్రాంత సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

25 వేల ఉద్యోగాల భర్తీకి హామీ

త్వరలోనే మరో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసి లక్ష ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. కులగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని, ప్రధాని మోదీకి సవాల్‌ విసిరామని పేర్కొన్నారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌పై ఘాటు వ్యాఖ్యలు

బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలపై సీఎం విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీకి ప్రాధాన్యం ఉంటుందని వ్యాఖ్యానించారు. బండి సంజయ్‌, రాంచందర్‌రావు, కిషన్‌రెడ్డి ఎంత ప్రయత్నించినా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాదని అన్నారు.

బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటోందని, గతంలో చేసిన పనులకు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి రావాలని, అసెంబ్లీలో తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు.

2034 వరకు కాంగ్రెస్‌‎దే అధికారం

బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుటుంబాల సంక్షేమం కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ వారసత్వంగా పేదల సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అచ్చంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించడంతో పాటు ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని బహిరంగ సభలో స్పష్టం చేశారు.