అయ్యప్ప భక్తులకు అలర్ట్... శబరిమల యాత్రలో అలా చేయద్దు..!

అయ్యప్ప భక్తులకు అలర్ట్... శబరిమల యాత్రలో అలా చేయద్దు..!

శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కీలక హెచ్చరిక జారీ చేసింది కేరళ ప్రభుత్వం. నిలక్కల్ నుంచి పంబ వరకు ప్రయాణించే అయ్యప్ప భక్తులు ఆహార వ్యర్థాలు, ప్లాస్టిక్ వస్తువులను రోడ్లపై పారవేయవద్దని హెచ్చరించింది. రోడ్లపై చెత్తను వేయడం వల్ల వన్యప్రాణులు అటుగా వస్తున్నాయని... దీనివల్ల వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

నవంబర్ 16 నుంచి 23 మధ్య ఈ మార్గంలో వాహనాలు ఢీకొనడంతో రెండు కోతులు, ఒక నీలగిరి లంగూర్ చనిపోయినట్లు అధికారులు చెప్పారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం నీలగిరి లంగూర్ షెడ్యూల్ 1 జాతికి చెందినదని అటవీ శాఖ అసిస్టెంట్ కన్జర్వేటర్ మను సత్యన్ ఒక ప్రకటనలో తెలిపారు.

నిలక్కల్ నుంచి పంబ వరకు ఉన్న 19 కిలోమీటర్ల రోడ్డు అటవీ ప్రాంతం గుండా వెళ్తుందని మను సత్యన్ తెలిపారు. రోడ్డు వెడల్పు పెరిగి తారు వేయడం వల్ల వాహనాలు వేగంగా వెళ్తున్నాయని... దీనివల్ల ముప్పు పెరిగిందని అన్నారు. వేగాన్ని నియంత్రించేందుకు అదనపు చర్యలు తీసుకోవాలని... భక్తుల్లో అవగాహన పెంచడంతో పాటు వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచాలని కోరింది.

మరోవైపు శబరిమల యాత్ర మార్గంలోని లోయర్ అప్పాచిమేడు దగ్గర భక్తుల కోసం 7 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశ్రాంతి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు తెలిపింది. ఇక్కడ ఒకేసారి వెయ్యి మంది భక్తులు విశ్రాంతి తీసుకోవచ్చని బోర్డు వెల్లడించింది.

ఈ కేంద్రంలో టైల్స్ ఫ్లోరింగ్, స్టీల్ బెంచీలు, సీట్లు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యం కోసం తాగునీటి కుళాయిలు, టాయిలెట్లు అందుబాటులో ఉంచారు. గతంలో నిరుపయోగంగా ఉన్న ఈ స్థలాన్ని రూ. 11 లక్షలతో ఆధునీకరించినట్లు టీడీబీ తెలిపింది. ఈ కేంద్రాన్ని నవంబర్ నెలాఖరులోగా ప్రారంభిస్తామని టీడీబీ అధికారులు తెలిపారు.