అకాల వర్షం.. కొట్టుకుపోయిన ధాన్యం..ఉమ్మడి మెదక్ జిల్లాలో పలుచోట్ల వర్షం

అకాల వర్షం.. కొట్టుకుపోయిన ధాన్యం..ఉమ్మడి మెదక్ జిల్లాలో  పలుచోట్ల వర్షం

రామాయంపేట/తొగుట/నిజాంపేట, వెలుగు : మెదక్, సిద్దిపేట జిల్లాల్లో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులను తీవ్రంగా నష్టపరిచింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో పాటు పలుచోట్ల వరదకు కొట్టుకుపోయింది. 

మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్, కోనాపూర్ గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. కోనాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బండపై ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోగా, వరదతో  20 మంది రైతులకు చెందిన సుమారు 100 క్వింటాళ్లకు పైగా ధాన్యం కొట్టుకుపోయింది. 

నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లోనూ మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం వరదకు కొట్టుకుపోయి, పలువురు రైతులకు నష్టం వాటిల్లింది. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం తిర్మలాపూర్ కొనుగోలు కేంద్రంలోనూ అకాల వర్షానికి రైతులు ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.